పుట:Oka-Yogi-Atmakatha.pdf/777

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

741

మానవుడు’గా కాని, ‘ప్రజ్ఞాపరుడైన మానవుడు’గా కాని స్థూలంగా వర్గీకరించవచ్చు.

“మనిషి ప్రతిరోజూ సుమారు పదహారేసి గంటలసేపు భౌతిక వాహనంగా తనను భావించుకుంటూ ఉంటాడు. తరవాత నిద్రపోతాడు; కలలు కనేటట్టయితే, సూక్ష్మలోక జీవుల మోస్తరుగానే ఏ వస్తువునయినా అనాయాసంగా సృష్టిస్తూ సూక్ష్మశరీరంలో ఉంటాడు. మానవుడి నిద్ర, కలలు లేకుండా చాలా గంటల సేపు గాఢంగా సాగినట్లయితే అతడు, తన చేతనను లేదా అహంకారతత్త్వాన్ని కారణశరీరానికి బదిలీ చెయ్యగలుగుతాడు. అటువంటి నిద్ర పునర్నవీకరంగా ఉంటుంది. కలలు కనేవాడు తన సూక్ష్మశరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాడు తప్ప, కారణ శరీరంతో కాదు; అతని నిద్ర పూర్తిగా పునర్నవీకరం కాదు.”

శ్రీయుక్తేశ్వర్‌గారు అద్భుతమైన ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే, నేను ప్రేమభావంతో గమనిస్తూ ఉన్నాను.

“గురుదేవా, మీ శరీరం అచ్చూమచ్చూ, నేను చివరిసారి పూరీ ఆశ్రమంలో చూసి వలవలా ఏడ్చినప్పటి శరీరంలాగే ఉందండి.” అన్నాను.

“ఔను. నా కొత్త శరీరం, పాతదానికి పరిపూర్ణమైన నకలు. ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షంచెయ్యడం, అదృశ్యం చెయ్యడం చేస్తూంటాను; భూమిమీద చేసిన దానికంటె కూడా తరచుగా చేస్తూ ఉంటాను. శీఘ్రంగా అదృశ్యం చెయ్యడంవల్ల నే నిప్పుడు కాంతిరథం (లైట్ ఎక్స్‌ప్రెస్) మీద ఒక గ్రహంనుంచి మరో గ్రహానికీ, నిజానికి సూక్ష్మలోకంనుంచి కారణలోకానికి లేదా భూలోకానికి, క్షణంలో ప్రయాణం చేస్తూంటాను,” అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు.