పుట:Oka-Yogi-Atmakatha.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

556

ఒక యోగి ఆత్మకథ

పూనినవాడే, ధ్యానయోగం ద్వారా పరమ రహస్యాల చిక్కుముళ్ళు విడదియ్యడానికి అర్హుడు.’ ”

“ ‘గురుదేవా, నష్టమయిన క్రియాయోగాన్ని పునరుద్ధరించి మీరు, మానవజాతికి మహోపకారం చేసినట్టే, శిష్యరికానికి కావలసిన కఠిన నియమాలు సడలించి, దానివల్ల కలిగే లాభాన్ని మీరు పెంపొందించరా?’ అని విన్నవించుకుంటూ బాబాజీ కేసి చూశాను. ‘చిత్తశుద్ధి గల అన్వేషకు లందరూ మొదట్లోనే సంపూర్ణ అంతస్సన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ, వారందరికీ కూడా క్రియాయోగం అందించడానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో, మూడు విధాలైన క్లేశాలకీ[1] గురిఅయ్యే పీడిత స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకి క్రియాయోగ దీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెన్నటికీ ముక్తిమార్గమే తొక్కకపోవచ్చు.’ ”

“ ‘అలాగే కానియ్యి. ఈశ్వరేచ్ఛ నీ ద్వారా వ్యక్తమయింది. వినయంగా నిన్ను సహాయమడిగే వాళ్ళందరికీ క్రియాయోగ దీక్ష ఇయ్యి,’ అని జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు.[2]

  1. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక క్లేశాలు; ఈ మూడూ వరసగా, జబ్బు, మానసిక లోపాలు లేదా వైకల్యాలు, ఆత్మవిషయకమైన అవిద్య అన్న రూపాల్లో వ్యక్తమవుతుంటాయి.
  2. మొదట్లో మహావతార బాబాజీ, ఇతరులకు క్రియాయోగ దీక్ష ఇవ్వడానికి లాహిరీ మహాశయుల కొక్కరికే అనుమతి ఇచ్చారు. తరవాత, యోగావతార మూర్తులైన లాహిరీ మహాశయులు, క్రియాయోగం ఉపదేశించడానికి తమ శిష్యుల్లో కొందరికి కూడా అధికారం ఇమ్మని కోరారు. బాబాజీ అంగీకరించారు; అంతే కాకుండా, భవిష్యత్తులో క్రియాయోగ దీక్షాప్రదానం, క్రియాయోగ పథంలో ప్రగతి సాధించి, లాహిరీ మహాశయులనుంచి కాని ఆ యోగావతారుల అధికృత శిష్యులు ఏర్పరిచిన మార్గాలనుంచి కాని అధికారం పొందినవాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండాలని ఆదేశించారు. యథావిధిగా అధికారం పొందిన క్రియాయోగ ఉపదేశకుల దగ్గర దీక్ష తీసుకున్న, భక్తివిశ్వాసాలుగల క్రియాయోగులందరి ఆధ్యాత్మిక సంక్షేమానికి జన్మజన్మాంతర బాధ్యత తాము స్వీకరిస్తామని బాబాజీ కనికరంతో అన్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా క్రియాయోగ దీక్ష తీసుకునేవాళ్ళు, క్రియాయోగ ప్రక్రియను తాము ఇతరులెవరికీ వెల్లడి చెయ్యం అని ఒక ప్రమాణపత్రంమీద తప్పనిసరిగా సంతకం చెయ్యవలసి ఉంటుంది. ఈ విధంగా, సులభమూ సునిశితమూ అయిన క్రియాయోగ ప్రక్రియ అధికారం పొందని ఉపదేశకుల మూలంగా మార్పులకూ వికారాలకూ లోనుకాకుండా పరిరక్షితమై మౌలిక, అవికారరూపంలో నిలిచి ఉంటుంది.

    సామాన్య ప్రజలు క్రియాయోగంవల్ల లాభం పొందడానికని బాబాజీ, పురాతనమైన వానప్రస్థ, సన్యాసాశ్రమ సంబంధమైన నిర్బంధాలు తొలగించినప్పటికీ దీక్ష కోరే వారికి ఎవరికయినా సరే క్రియాయోగ సాధనకు తయారుగా ప్రాథమిక ఆధ్యాత్మిక శిక్షణ కాలం ఒకటి లాహిరీ మహాశయులూ దాని ఆధ్యాత్మిక పరంపర (వై . ఎస్. ఎస్. - ఎస్. ఆర్ . ఎఫ్. గురుపరంపర) లోని శిష్యులందరూ విధించాలని ఆయన ఆదేశించారు. క్రియాయోగం వంటి అత్యున్నత యోగ ప్రక్రియాసాధన అస్థిరమైన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడేది కాదు. క్రియాయోగం ధ్యానప్రక్రియను మించినది; అదొకజీవిత మార్గం; అంచేత, దీక్ష పొందేవాడు కొన్నికొన్ని ఆధ్యాత్మిక విధుల్నీ నిషేధాల్నీ మన్నించడం అవసరమవుతుంది. మహావతార బాబాజీ, లాహిరి మహాశయ, స్వామి శ్రీయుక్తేశ్వర్, పరమహంస యోగానంద గార్ల ద్వారా పారంపర్యంగా వచ్చిన ఈ బోధలను యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ నిష్ఠగా పాటిస్తున్నాయి. వై. ఎస్. ఎస్. - ఎస్. ఆర్. ఎఫ్. వారి పాఠాల ద్వారాను, వై . ఎస్. ఎస్. - ఎస్. ఆర్ . ఎఫ్. వారి ఆధికారం పొందిన ప్రతినిధుల ద్వారాను క్రియాయోగానికి, ఉపక్రమణగా నేర్పే హంస (హాంగ్సా), ఓం ప్రక్రియలు, క్రియాయోగ పథంలో అంతర్భాగాలే. ఈ ప్రక్రియలు, ఆత్మసాక్షాత్కారం పొందడానికి చైతన్యాన్ని జాగృతం చేయడంలోనూ ఆత్మను దాస్యం నుంచి విముక్తం చేయడంలోనూ సమర్థమైనవి.