పుట:Navanadhacharitra.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

నవనాథచరిత్ర

వెఱఁగంది ధారుణీ ◆ విభుఁ డుల్ల సిల్లి
తెఱఁ గొప్పఁ బిలిచి తో ◆ డ్తెం డని భటులఁ
బనిచిన వారును ◆ బఱచి వేవేగఁ
జనుదెం డని పిలువ ◆ జగదీశవిభుఁడు
పుత్తెంచె ననుడుఁబో ◆ పొమ్ము మామాట
చిత్తంబులో విశ్వ ◆ సింపఁడు నృపుఁడు
నిద్దుర గన్నుల ◆ నిండఁ గ్రమ్మెడిని
ప్రొద్దునఁ జనుదెంచి ◆ [1]పొడగాంతు ననిన
మగిడి యామాటలు ◆ మానవేశ్వరుకుఁ
దగ విన్నవింపఁ ◆ దాఁదఱితీపుచేసి
పిలిచి యాతనికి న ◆ భీష్టవస్తువులు
వలసినయంత న ◆ వారణ నొసఁగి
యనిపిన నాసొమ్ము ◆ నందులో సగము
కొని హయరక్షుకుఁ ◆ గొమరొప్ప నిచ్చి
మనమున నలరుచు ◆ మఱియుఁ గొన్నాళ్లు
చన నిచ్చి యతఁడొక ◆ [2]సఖ్యవంచనము
చేయంగ మనమునఁ ◆ జంతించి ధరణి
నాయకునొద్ద నం ◆ తఃపురిలోనఁ
ద్రిజగముల్ గెలువంగఁ ◆ దివురుమన్మథుని
విజయధ్వజముఁ బోలి ◆ విలసిల్లుచున్న
యనుపమ శుభలక్ష ◆ ణాంగిఁ దత్పుత్రిఁ
గని చేరఁ బిలిచి త ◆ త్కరపంకజమునఁ
గలభాగ్యరేఖలు ◆ గలయ వీక్షించి
తల యూఁచి యంతటఁ ◆ దనముక్కు మీఁద
వ్రే లిడి వెడవెడ ◆ వేసాలువేసి
మేలు కీ డని మాకు ◆ మేదినీనాథ
చెప్పకుండినఁ దప్పు ◆ చెప్పినఁ జిత్త
మప్పు డెట్లగునొ మే ◆ లైన మాయెఱుక
మెచ్చరుగాని యే ◆ మేనియుఁ గీడు
వచ్చిన మము దూఱ ◆ వత్తు రందఱును
గాన మే మిప్పుడు ◆ కన్నదోషములు
పూని చెప్పెద మీవు ◆ బుద్దిగా వినుము

  1. పొగడొందననిన.
  2. సంఖ్యదుర్జనము.