పుట:Navanadhacharitra.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

నవనాథచరిత్ర

త్రోవఁ జిత్రాంగిమం ◆ దులు తలకెక్కె
భూమిలో రాజులు ◆ భోగభామినుల
పై మోహ మెసఁగిన ◆ పదివేల నిచ్చి
పుచ్చిరి కాదేని ◆ పుత్రుఁ గోయింప
నిచ్చిరే యెందైన ◆ నిటు దయమాలి
గురుభక్తినిరతుండు ◆ కోమలాంగుండు
దురితదూరుండు బం ◆ ధురమానఘనుఁడు
వినయభూషణుఁ డతి ◆ విమల మానసుఁడు
గొనబులప్రోడ నా ◆ కొడు కిట్టికాంత
కేమిటి గొడఁబడె ◆ నిది కపటంబు
కామాంధుఁడవు కన్ను ◆ గానవుగాక
యింకనైనను బుత్రు ◆ నీ తప్పుఁగాచి
ఝంకించివిడువుము ◆ చాలు నొండేని
పురమువెల్వడఁగొట్టి ◆ పొమ్మన్ననైన
నరిగి తాపసవృత్తి ◆ నడవులలోన
నాకులు భక్షించి ◆ నర్థి నుండెదము
నాకోడలును నేను ◆ నా కూర్మిసుతుఁడు
దూరభూములకైనఁ ◆ దొలఁగిపోయెదము
ఈరాజ్యభోగంబు ◆ లింతియే చాలు
ననుచు రత్నాంగి దుః ◆ ఖావేశమునను
తను దూఱునప్పు డా ◆ ధరణివల్లభుఁడు
తెలిసియుందెలియని ◆ తెఱఁగున నుఱకె
తలవంచి చిత్రాంగిఁ ◆ దలఁచుచునుండె
నప్పుడు రత్నాంగి ◆ యంతరంగమున
ముప్పిరిగొను శోక ◆ మును నోర్వలేక
దాసీజనంబులు ◆ తగిలి యేతేర
నాసూనుఁ జూపరే ◆ నయనాభిరాము
నని ప్రలాపించుచు ◆ నాత్మజునగరు
చని చొచ్చిపోవ నా ◆ సమయంబునందు
నలి నింద్రజిత్తుండు ◆ నాగపాశముల
బలిమిఁ గట్టిన రామ ◆ భద్రుని పగిది
నలఁగుచుఁ దలఁచుచు ◆ నాత్మదైవంబు