Jump to content

పుట:Narayana Rao Novel.djvu/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండేమార్గాలు

357

చెన్నపురి కాపురమును గట్టిపెట్టి భార్యాది బంధుసహితుడై తండ్రితో వెళ్ళిపోయినాడు.

శకుంతల చెన్నపట్టణములో నాల్గుదినములుండి తిరిగి వెళ్ళిపోయినది. ఆమె చెన్నపట్టణములో నున్నంతకాలము నారాయణరావుతో నన్ని విషయములు మాట్లాడుచు, నాతనితో నమిత స్నేహమున సంచరించుచు, జెల్లెలిచే నాతని బలవంతమున బరిచర్యల జేయించుచుండెను. శారద కింత సిగ్గేమియని యామె తలపోసికొన్నది. భార్యాభర్త లెప్పుడు మాట్లాడుకొనరు. శారద యేమియు నారాయణున కందిచ్చుటగాని, యాతనికి వలయు సేవల నొరు లొనరించునట్లు చూచుటగాని యామెకు గనబడలేదు. వీరిరువురి హృదయపరిస్థితు లెట్లున్నవో యామెకు బూర్తిగా దెలియలేదు.

ఒకనాడు నారాయణుని యాతనిగదిలో నుండుమని కోరినది. తన చెల్లెలు శారద నచ్చటకు గొనిపోయెను. శారదయు, నారాయణరావును గూడ తెలబోయిరి.

‘మా అమ్మాయిచేత మీకు తలదువ్వించాలని సరదా అండీ’ యని శకుంతల యన్నది. ఆశ్చర్యపడి, చిరునవ్వుతో నారాయణరావు ‘నాకు కొంచెము పనిఉంది వదినగారూ’ అనెను.

శకుం: మీ పని సరేలెండి, నేను ప్రార్థించే ఈ కాస్తపనీ నాకోసం చేయరాదా మరిదిగారు?

నారా: మీ యిష్టం.

శారద భయము, సంతోషము, ఆశ్చర్యము తన్ను ముంచివేయ వణకుచు నారాయణునికి తలదువ్వెను.

కొత్తపేట వచ్చిన కొన్ని దినాలకు పెద్దాపురమునుండి నారాయణరావు స్నేహితుడొకడు తంతి నిచ్చాడు. ‘మీ అక్కగారిని మీ బావగారు కొట్టి వీధిలోనికి దరిమి తలుపు వేసినాడు. మీ అక్క మూర్ఛపోయింది’ యని యందున్నది.

నారాయణరావు తత్ క్షణం పెద్దాపురము వెళ్ళిపోయినాడు. ఎందుకు పెద్దాపురము వెళ్ళినది యేరికి తెలియనీయలేదు.

పెద్దాపురమునకు నారాయణరావు వెళ్ళునప్పటి కన్నియు భీభత్సముగ నున్నవి. భార్యాభర్తలుగాని, తన మేనకోడలుగాని భోజనమే చేయలేదు. తన చిన్నక్క గారికి మూర్ఛ వచ్చుచునేయున్నది. నారాయణరావు హృదయమంతయు గోపముతోను, విచారముతోను నిండిపోయినది.

మగవా రీ రీతి నెట్లు సంచరించగలరు? ఆడువారు పశువులని భావించి చరించు పురుషు లింక నీనాటి కున్నారా? సంపూర్ణ మానవత్వము లేని వీరికి మోక్షార్హత ఎప్పుడు వచ్చునో! పంచమ సహోదరులయెడ, బీదజనులయెడల,