Jump to content

పుట:Narayana Rao Novel.djvu/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

నారాయణరావు

సుబ్బా: భావం లేకపోతే కళ కానేకాదుగదాండి. అంచేత భరతము అంటే భావ రాగ తాళయుక్తమైంది అని భరతశాస్త్రం చెబుతుంది.

జమీం: చిత్తం.

సుబ్బా: అభినయం సంగీతంగా ఉండాలి. అంటే రాగయుక్తంగా, తాళయుక్తంగా ఉండాలి. తాళం పదముల గతివల్ల, రాగము పాడడంవల్ల చూపిస్తారు. నాట్యంచేస్తూ, ఒక పదం పాడుతూ ఒక భావాన్ని ప్రదర్శించేది కరణం. ఆ కరణానికి ముఖ్యభావ సూచనను బట్టి పేరుపెట్టారు. అలాగు లెక్కచూస్తే నూటయెనిమిది కరణాలు ఉదహరించాడు భరతుడు. కొన్ని కరణాలు కలిస్తే అంగహారము అంటారు.

జమీం: విశదంగా చెప్పాలండి.

సుబ్బా: త్యాగరాయకృతిని తీసుకుందాం. కృతి సంపూర్ణకావ్యము. అందులో పల్లవి ఒక కరణంవంటిది. అనుపల్లవి ఇంకోకరణం. చరణాలు ఇతర కరణాలు. అన్నీ కలసి అంగహారం అన్నమాట. ఎన్నో కృతులు ఒక మహాకావ్యం. ప్రతి అష్టపది ఒక అంగహారం అనుకోండి – అన్ని అష్టపదులు కలసి మహాకావ్యం. అల్లాగే ఒక సంపూర్ణకావ్యం నర్తించడం, ప్రదర్శించడం ‘నాట్యం’ అంటారు.

జమీం: చిత్తం.

నళిని: పెదనాన్నగారూ! అభినయం నాలుగురకాలన్నారు. అవి చేతులు తిప్పడం మొదలైనవేనా అండీ?

సుబ్బా: అవునమ్మా, అంగాభినయంలో దేహం అంతా వస్తువు అవుతుంది. అందులో ముఖ్యాంశాలు, ప్రత్యంగాలు, ఉపాంగాలు అని ఉన్నాయి. చేతులు, తల, కళ్లు, కంఠము, పార్శ్వము, నడుము, కాళ్ళు ముఖ్యాం గాలు. చేతికి మోచేయి ప్రత్యంగము, వ్రేళ్లు ఉపాంగాలు. కంటికి కనుబొమ ప్రత్యంగము, కనురెప్పలు, గ్రుడ్లు ఉపాంగాలు. అలా అన్నిటికి. వీని కదలికతో భావం చెప్పడం అంగాభినయము. భరతుడు, నందికేశ్వరుడు ఈ అభినయాలు విధించారు. అవి కాలాన్ని బట్టి మారాయి లెండి.

పర: లేకపోతే వివిధ రాష్ట్రాల్లో వివిధ విధానాలు ఎల్లా వచ్చాయండి?

యజ్ఞ: ఏమిటయ్యా పరమేశ్వరమూర్తీ, ఆ విధానాలు?

పర: కథకళి సంప్రదాయం మళయాళ దేశంలో, కథక సాంప్రదాయము ఉత్తరదేశాల్లో, మణిపూరులో ఆ పేరిటి సంప్రదాయం – కూచిపూడి సంప్రదాయం, తంజావూరి సంప్రదాయం ఇల్లా ఉన్నాయి బావగారూ!

సుబ్బా: నేను ఆ వివిధరకాల నాట్యాలుచూడలేదు గాని, పూర్వం విదుషీమణులు, సుందరశరీరం కలవాళ్లు అయిన భోగంవాళ్ళు తెలుగుదేశంనిండా ఉండేవాళ్ళు. అద్భుతంగా నాట్యంచేసేవాళ్లు. వారి నాట్యాలెన్నో చూశాను.