పుట:Narayana Rao Novel.djvu/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భర్తయే గురువు

297

‘ఇక వెళ్ళవచ్చు’ నని నారాయణరావు లేచి క్రిందకు దిగి వెళ్ళిపోయినాడు. శారద యిట్టి బోధన మెన్నడువినలేదు. దూదివలె విడబరచి వెనుకకు బోవుచు ముందుకు సాగుచు పాఠమంతయూ హృదయమున హత్తిపోవునట్లు చెప్పినాడు. ఇదివరకెవ్వరును ఇంత బాగుగా చెప్పలేదు.

‘చూశావా వదినా! మా అన్నయ్య ఎంత బాగా చెప్పాడో! నేను తప్పక ఈయేడు పరీక్ష నెగ్గి తీరుతాను. మీ పరీక్షలు మా పరీక్షలు ఒకమాటే.’

‘ఇవాళ చాలాబాగా అర్థమయింది సూరీడూ.’

ఆరోజున శారద కేలనో హృదయము సంతోషమున పూర్ణమై, ఆమెను వివశత్వమున కదిల్చివేసినది.

నారాయణరావు తాను భార్యను ప్రేమించు చున్నట్లు కనబడకూడదు. ఇదియంతయు మామూలుతంతుగ జరిగిపోవుచున్నట్లామెకు దెలియవలెను. తన హృదయము, జీవితము ఆ బాలికపై ప్రణయముచే నిండి, జగమెల్ల నుబికి, సృష్టి నంతయు నాక్రమించుకొన్నదని యామె కెట్లుతెలియును? తెలియుటయు వలదు.

ఈ ప్రేమమహానిర్ఝరి గోచరించి భయపడినదా యీ బాలిక? ఆమెలో నేమియున్నది తన్నిట్లాకర్షించుటకు? అందమైన రూపరేఖావిలాసము లుండవచ్చును. అట్లందమయినవా రితరులు లేరో? శ్యామసుందరి సౌందర్యమున శారదకు జోడు కాగలదు. శారదకన్న సరళహృదయ, గంభీరమానస, విజ్ఞాన సంపన్నురాలు. ఆమె ప్రేమలో ముంచి వేయదలచుకొన్నచో నెవ్వరు నిలబడగలరు? అయిన నాబాల తనలో నిట్టి ప్రణయభావము జనింపజేయలేకపోయినది. ఈ శారదలో నేమున్నదో! ఆమె ఆత్మసంస్కార మెంత యున్నతమో!

శారద చెన్నపురి వచ్చిన వెనుక శ్యామసుందరిలో దీప్తి యెక్కువ అయింది. ఆ యిరువురకు దనకు నేమి సంబంధము! శారద భార్యయేమి? ఏ యదృష్టమున శారద భార్య యయినది? ఏ పూర్వపుణ్యాన శ్యామసుందరి మిత్రురాలేనది?

శ్యామసుందరి వైద్యకళాశాలనుండి వచ్చి యింటిలో నొక పడకకుర్చీపై చదికిలబడినది. ఆమెకు బరీక్షాదినములు సమీపించుచున్నవి. రేయింబవళ్లు నిద్ర హారములు మాని యామె విద్యాదీక్షితయైనది. చదువు, చదువుమధ్య నిద్ర, నిద్రమధ్య నారాయణరావుమాత్ర మామెకు సతతము గోచరించును.

నారాయణ యన్నచో దనకింత మైత్రి యేలనో యామె కర్థముకాలేదు. నారాయణరావును దాను ప్రేమించుట లేదుకద! అయిననేమి? అట్టి మహాపురుషుని, పూర్ణవ్యక్తిని బ్రేమించుటకన్న తన జన్మమునకు సార్థకత యేమున్నది? అతడు పరాధీనుడు; అయిన నాతని తన యంతరాంతముల బ్రేమించి యానంద పరవశయై కరిగి యాతని యాత్మాంతఃపదంబుల బ్రవహించిపోవుటకన్న తరణోపాయము లేదు. అని అనుకొనుచు ధ్యానముద్రయైనది.