270
నా రా య ణ రా వు
రాలేదు. ఆనాడు జమీందారుగారు వచ్చుటచే నారాయణరావు మామగారితో మాట్లాడుటకు వెళ్ళుచు స్నేహితులను తరువాత వచ్చి కలిసికొందునని చెప్పి, కీలుపాక్ లో మామగారి యింటికి మోటారుమీద బోయినాడు.
అనేక విషయములగూర్చి సంభాషించినవెనుక, శ్యామసుందరీదేవి తన తండ్రినిగూర్చి మాటలువచ్చి ఇట్లు పలికినది.
‘మా తండ్రిగారున్ను వీరేశలింగకవిగారి శిష్యుడండీ పరమేశ్వరమూర్తిగారు! చిన్నతనములోనే భర్తను గోల్పోయిన మా తల్లి యామెతల్లిదండ్రులకు దెలియకుండ, చెన్నపురిలో శ్రీ వీరేశలింగము పంతులుగారి యాజమాన్యమున విధవా వివాహసంఘమువారు నెలకొల్పిన వితంతు బాలికాశ్రమమునకు బారిపోయివచ్చి యచ్చట చదువుకొనుచు ప్రవేశపరీక్షలో ప్రథమతరగతిలో నుత్తీర్ణురాలైనది. మా తల్లి అయిన ఆండాళ్‌దేవిగారి తెలివితేటలూ, చక్కదనమూ చూచి మా తండ్రి ఆమెను వివాహమాడినాడు.’ అంత రోహిణీదేవి తన యింట జేరిన స్నేహితుల కందరకు టీ పానీయ మిచ్చెను.
శ్యామసుందరీదేవి యందము నానాట బెరుగుచున్నను కొంచెము చదు వెక్కువగుటచే జిక్కిపోసాగినది. రోహిణీదేవి సంపూర్ణ యౌవనము దాల్చినది. సరళాదేవికి వయసు పరిమళించుచున్నది. నళినికి బ్రాయము తొలకరించినది. ఆ మిసిమి మిటారిబాల కన్నుల సహజమగు నవ్వుల కాంతులు మరియు వెలుగు చుండ వదనాంచలముల హాసములు ప్రసరింపుచుండ నల్లరిమాటల నందరిని మేలమాడసాగినది.
సరళ యేరితోడను సాధారణముగ మాట్లాడదు. మితభాషియగు రాజారావును, ఆమెయు వైద్యవృత్తిని గూర్చియు, వేదాంతమునుగూర్చియు మాట్లాడువారు. రాజారావు అమలాపురములో వైద్యవృత్తి నారంభింప వెడలిపోయిన వెనుక, నేటికి పరమేశ్వరమూర్తి భార్యకు గర్భస్రావమగునంత గడబిడయగుటయు, రాజారావుకు తంతినంప నాతడు చెన్నపురి కరుదెంచెను. రాజారావు వృత్తి నవలంబించిన తర్వాత నా బాలిక లాతని చూచుటకదే మొదలుగావున నాతడు రాగానే,
‘నమస్కారమండి రాజారావు గారూ! ఎప్పుడు వచ్చారు?’ అని ఒక్కసారిగా నడిగినారు.
‘రెండురోజు లైనదండీ.’
‘ఇప్పుడాండి మాకు కనబడుట డాక్టరుగారూ’ అని శ్యామసుందరీదేవి ప్రశ్నించినది.
రాజా: పరమేశ్వరమూర్తి భార్యకు జబ్బుచేసినది, కొంచెం కంగారుపడ్డారు. నారాయణరావూ, అతనూను నాకు తంతినిచ్చారు. నిన్న ఉదయం వచ్చాను. నిన్న సాయంత్రానికే కొంచెం సుగుణమిచ్చింది.