పుట:Narasabhupaleeyamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కావ్యాలంకారసంగ్రహము


క.

అల తద్ధితములయందుం, దెలియ వతిప్రత్యయంబు తెలుఁగున లేమిం
గలిగినకల్పప్ప్రత్యయ, మలరుచు నయ్యార్థియంద యది గనుపట్టున్.

11


ఉ.

కావునఁ బూర్ణపంచవిధ కన్గొన లుప్తయు సామ్యధర్మ మీ
క్షావిధిఁ గూర్ప కున్నయెడ శ్రౌతియు నార్థియునై యథోక్తసం
భావనవాక్యయుక్తము సమస్తయు వాక్యసమాసతద్ధిత
శ్రీవిశదాత్మయై ధరణిఁ జెన్నగుసాయకసంఖ్య నె ట్లనన్.

12

సమాసగతపూర్ణార్థి —

క.

ఈవియుఁ జల్లదనంబును, గేవలసౌందర్యగుణము గిఱికొనఁగఁ గళా
భావుకుఁ డైననృసింహ, క్ష్మావల్లభుఁ డమరుఁ బూర్ణచంద్రోపముఁడై.

13

వాక్యగతపూర్ణార్థి —

క.

వెలయు జవరాండ్రు తలఁపుల, వలపును నిలుపఁగఁ జాలు వరరూపమునం
జెలఁగుచు నృసింహుఁ డలరుల, విలుకానికి సాటి యయ్యె విశ్రుతలీలన్.

14

తద్ధితగతపూర్ణార్థి —

క.

ఏయెడల నియ్యనియ్యం, గాయలు గాచిన నృసింహుకర మర్థులకుం
బాయని వడ్క ఫలించుచు, నాయతగతిఁ గల్పకల్ప మై విలసిల్లున్.

15

వాక్యగతపూర్ణశ్రౌతి —

క.

దివియును భువియు భుజంగమ, భువనంబును నిండి విమలభూరిప్రభతో
దివిజేంద్రతటినియో యన, నవిరళగతిఁ బొల్చు నీదుయశము నృసింహా.

16

సమాసగతపూర్ణశ్రౌతి —

క.

కరముల శంఖము చక్రము, నిరవుగ నురమందుఁ జెంది యిందిర దనరన్
హరివలె వెలయుదు వౌరా, వరసాహసయోబరాజు నరసింహనృపా.

17

పంచవిధానుపాత్తధర్మలుప్తోపములు —

శా.

నీదోఃఖడ్గమహీంద్రుఁడో యనఁ దగు న్నీదివ్యతేజోభరం
బాదిత్యుండునుబోలెఁ బొల్చు భవదీయాలాపము ల్వల్లకీ
నాదబ్రహ్మము సాటి నీకరము మందాగోపమానంబు నీ
ప్రాదుర్భావము భవాభ్యుదయకల్పం బౌ నృసింహాధిపా.

18

అనుపాత్తోపమానలుప్త —

సీ.

జలదంబుగతి నిచ్చి వెలవెలఁ బాఱక, కలశాంబునిధిరీతిఁ గసరుకొనక
యీగిమ్రాన్వలె ఫలం బిడి జిగి దప్పక, సురభికైవడిఁ గొలు వరసి యీక
కమలారివలె నిచ్చి క్రమ్మఱఁ గైకోక, బలిమాడ్కి నర్ధిచే భంగపడక
దండాంశుసుతుపోల్కిఁ గుండమార్పులు గాక, వాసనమణిభాతిఁ ద్రాసమంద


తే.

కొసఁగ నేర్తువు యాచకవ్యూహమునకు, భూనుతానూనదానవిద్యానిరూఢి
బొసఁగ నీతోడ నెవ్వానిఁ బోల్పవచ్చు, సరసగుణహార యోబయనరసధీర.

19