పుట:Nannayabhattaraka Charitramu Kasibhatla Brahmayya 1901.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టారకచారిత్రము.

పీఠిక.


పాశ్చాత్య విద్యా సూర్య పదప్రచారము మనయాంధ్రకవితాఘనతకుఁ గ్రొత్తరాగమును గలిగించుచున్నది. ఆ హేతువుచేతనే మనలోఁ బూర్పకవిచారిత్రము లనేకము లీ నడుమ నుత్పన్నములైనవి. కాని యవియన్నియునుగూడఁ బల్వురు కవులనుగూర్చి ముచ్చటించునవి యగుటచేఁ బ్రతికవినిగూర్చియును మిక్కిలి సంగ్రహముగా ముచ్చటించునవియై యున్నవి. ముఖ్యకవిశిఖామణుల చారిత్రము లైనను బాగుగా విస్తరింపఁజేయఁబడి యుండలేదు. ఇట్టిసంగ్రహములవలనఁ గొంతలాభము కలదుగాని మొత్తముమీఁద నాయాచరిత్రములఁ జక్కఁగాఁ దెలిసికొని యానందించుటకును విషయమును బాగుగా గ్రహించుటకును జదువరుల కంతగా సహాయము కలుగదు. కాఁబట్టి ముఖ్యకవులచారిత్రములను విపులముగా వ్రాయుంతలంపుతో నేనీయాదికవిచారిత్రమును బ్రారంభించి యిప్పటికి మొదటిభాగమును మాత్ర మాంధ్రసరస్వతికి వ్యాపకార్థమై యొప్ప గింపఁ గలిగితిని. ఆ నాఁటి నన్నయభట్టారకునిచారిత్ర మీనాఁడు వ్రాయుటలో నాతనిసాంసారికచారిత్రమును విస్తరించి వ్రాయుట కనువుపడదు. అది యంతగా నవసరమును గాదు. నన్నయ భట్టనామకకవి చారిత్రమును మనము వ్రాయుచున్నామే కాని నన్నయ భట్టనామకగృహస్థ చారిత్రమును మనము వ్రాయుటలేదు. ఒకకవిచారిత్రమును వ్రాయునప్పు డాతని కేవైన గండములు వచ్చినవో లేవో యాతని పితరులపే ళ్ళేవో సతియెవరో సుతులెందఱో తెలియకుండిన నాచారిత్రమున కింతయు హానిలేదు. ఆతఁ డెట్టివంశమువాఁడో యెట్టిబుద్ధిగలవాఁడో యెట్లు విద్యాభ్యాసము నందెనో యెంతవిద్యను నేర్చెనో యెట్టికవిత్వమును జెప్పి భాష కెట్టివిశేషమును గలిగించెనో లెస్సగాఁదెలిసినఁ జాలును. అయ్యవి చదువరులబుద్ధికి వికాసమును గలిగించును. నన్నయచారిత్రవిషయములో నీసంగతులు బాగుగాఁ దెలిసికొనుటకును జర్చించుటకును జాలినంత యవకాశము కలదు. . కావున నాకనువైనంతవఱకు విషయపరిశోధనమును జేసి నాయల్పబుద్ధికిఁ దోఁచిన ట్లీచారిత్రమును వ్రాయుచుంటిని. నావ్రాసిన దెట్లున్నను నా యుద్యమము మంచిది గావున నీచిన్నిపొత్తము వివేకులకు నీయుద్యమమును నెగ్గింపఁ బ్రోత్సాహము నైన నొసంగు నని తలంచెదను. మఱియును నాలోచించిచూడఁగా మనభాష పలుభాషలవికార మైనట్లుగా నాకును దోఁచుటచే నేనావిషయమునే యిందువ్రాసియుంటిని. సత్యమగుచారిత్రమును