పుట:Naajeevitayatrat021599mbp.pdf/779

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖాస్తులు అ కమిటీ ముందుకు వెళ్ళినట్టు లేదు. ఇది కాబినెట్‌కు అసలే తెలియదు.

ఇది అధికార దుర్వినియోగమని మంత్రులపై ప్రకాశంగారు చేసిన మొదటి ఛార్జీ. [1]

తెనాలికి చెందిన శాసన సభ్యులు ఆలపాటి వెంకటరామయ్య గారు [2] మోహన్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థకోసం లక్ష రూపాయల ఋణం ఆడిగారు. ఆయన గోపాల రెడ్డిగారి వర్గానికి చెందినవాడు గనుక లక్ష రూపాయలు మంజూరు చేశారు. ఆ మోహన్ ఇండస్ట్రీసుకి సైను బోర్డు తప్ప, వేరే పరిశ్రమ అప్పుడూ లేదు. ఇప్పుడూ లేదు.

ఏ విధమైన హామీ (సెక్యూరిటీ) లేకుండా, తమ రాజకీయ మిత్రునికి లక్ష రూపాయలు ఇవ్వడం తప్పని ఎవరో శాసన సభ్యులు గట్టిగా అల్లరి చేసిన పిమ్మట, లక్ష రూపాయల విలువగల వేరే భూమి హామిగా ఇస్తున్నామని వారు పత్రం ఒకటి బలవంతాన వ్రాసి యిచ్చారు. ఆ అప్పు తీరలేదు. సెక్యూరిటీ ఇచ్చిన ఆస్తిపైన ఋణాన్ని రాబట్టుకొందామనుకొంటే, ఆ పత్రమే చెల్లదు. అనే మొదలైన వాదాలు లేవదీశారు.

అధికార దుర్వినియోగ నేరారోపణలో ఇది కూడా ఒకటి.

ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ధాన్యసేకరణ చురుకుగా జరగడానికని ఎరువులు చవకగా దొరకడం కోసమని బస్తాకు ఒకటి చొప్పున బోనస్ చీటీలు ఇచ్చేవారు. బోనస్ చీటికి ఇంత

  1. గోపాలరెడ్డిగారు సుదర్సన మిల్లుకు శాంక్షన్ చేసిన ఋణం, ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు తమిళ రాష్ట్రం వసూలు చేసుకోవలసిన ఋణాలలో చేరింది. వారికి ఆ మిల్లునంతా అమ్మినా ఆరులక్షలుకన్నా ఎక్కువ రాలేదట.
  2. ఈ వెంకటరామయ్యగారు 1962 లో మంత్రి అయ్యారు. పాపం, హఠాత్తుగా మరణించారు. మంత్రిగా ఉన్న సమయంలో, తెనాలి పట్నానికి వీరు చాలా ఉపయోగాలు చేసుకోగలిగారు. అక్కడ ఆయనకు మంచిపేరే ఉండేది.