పుట:Naajeevitayatrat021599mbp.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి పెద్దలు, మా కోరికలకు విరుద్ధంగా, ఎల్లా ఆ సైమన్ కమిషన్ వారిని మా నెత్తి కెక్కించారో చెప్పి వాపోయారు.

ఇండియాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఉంటూన్న సర్ శామ్యూల్ హోర్ ఇంగ్లాండునుంచి డిల్లీకి విమానంలో వచ్చిన సందర్భంలో ఆయన శాసన సభని చూడడానికి వచ్చాడు. ఆయన "మూర్తి" గాని, "శక్తి" గాని మమ్మల్ని యే విధంగానూ ఆకర్షించలేదు. ఆయనది తీవ్రమయిన క్రూరదృష్టి. ఆయన మాటాడిన ఆ రెండూ ముక్కలూ, ఆయన ఈ దేశానికి ఉపకారికాడు అన్న విషయం మాకు స్పష్టం చేశాయి.

నూతన పథకాన్వేషణ

సైమన్ కమిషన్‌ని బహిష్కరించవలసిందని ప్రబోధం చేస్తూ, మేమందరమూ కలిసి యోచించి బ్రిటిషువారికి, వారి రాజ్యాంగ పథకానికి ప్రతిగా, మా పథకాన్ని అందచెయ్య దలచాం. బహిష్కరణ కార్యక్రమం నడుస్తూ ఉండగానే, బ్రిటన్‌కీ, ప్రపంచానికీ కూడా విస్మయం గొలిపేదిగా ఉండే పథకాన్ని అఖిల పక్షాల వారికీ ఆమోదయోగ్యంగా తయారుచేసి అందచేద్దా మనుకున్నాం.

అసలు కాంగ్రెసు నాయకులు యావత్తు భారతజాతికి అంగీకారయోగ్యంగా ఉండే విధంగా అడపా తడపా ఒక రాజ్యాంగ పథకాన్నో, పద్ధతినో రూపొందిస్తూ ఉండవలసింది. నేను కేంద్ర శాసన సభలో పని లేనప్పుడల్లా హిందూ మహమ్మదీయ కలహాలు జరిగిన తావులకు వెళ్ళివస్తూ, అఖిలపక్ష సమావేశాలకీ, అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులకీ హాజరవుతూ, ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ నా కాలాన్నీ, ధనాన్ని వినియోగపరచే వాడిని. ఆ అఖిలపక్ష సమావేశాలలోనూ, కాంగ్రెసు కమిటీ మీటింగులలోనూ సుదీర్ఘమయిన చర్చలు జరుగుతూ ఉండేవి.

మహాసభలు 1885 నుంచీ జరుగుతూనే ఉన్నాయి. సహకార నిరాకరణ ఉద్యమం ధర్మమా అని దేశం అంతా క్రమశిక్షణతో కూడిన విధానానికి అలవాటుపడుతూ ఉంది. గాంధీగారి కాంగ్రెసూ, స్వరాజ్య