పుట:Naajeevitayatrat021599mbp.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైలు ప్రయాణాలకు ఆటంకాలు కల్పించబడే పరిస్థితులలో నడిచే వెళ్ళి తీరాలనే విషయం సుస్పష్టం చేయబడింది. మన రాష్ట్రంనుండి చాలామందే వెళ్ళారు. రైలు ప్రయాణానికి చాలామందికి అడ్డంకులు కలుగజేయబడ్డాయి. అడ్డంకులు కలిగిన ప్రాంతంనుంచి కాలినడకనే మనవాళ్ళందరూ ప్రయాణాలుచేసి ఆ జెండా సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

ఒక ఉదాహరణ

నాకు భమిడిపాటి సత్యన్నారాయణగారి అవస్థ ఇంకా జ్ఞాపకం ఉండిపోయింది. పెక్కు ఉద్యమాల అనంతరం ఆయన కొంతకాలంగా[1] నరసాపురంలో ప్లీడరుగా ఉంటున్నారు. ఆయన ఆరోజులలో నాగపూరు సత్యాగ్రహంలో పాల్గొనడానికి గాను, తనకు తప్పని సరిగా కావలసిన బట్టలు వగైరాలన్నీ ఒక గంపలో నెత్తిన పెట్టుకుని, మొత్తం దూరం అంతా కాలినడకనే నడచి వెళ్ళారు.

ఇతర రాష్ట్రాలుకూడా ఈ సత్యాగ్రహ సమరానికి ఇతోధికంగానే వాలంటీర్లను పంపించాయి.

అప్పట్లో అలముకొనిఉన్న నిరుత్సాహ పరిస్థితులలో కూడా నాగపూరు జెండా సత్యాగ్రహ సమరం బ్రహ్మాండంగానే సాగింది. ప్రభుత్వం వారు తమ ఓటమిని ఒప్పుకుని, దేశీయులు తమ జెండాను నిరభ్యంతరంగా ఏ అడ్డంకులూ లేకుండా ఎగుర వేసుకో వచ్చునని అనుజ్ఞ యిచ్చే పర్యంతమూ, ఈ యుద్ధకాండంతా జోరుగానే నడిచింది.

నాయకులకు, ప్రజలకూ పరస్పరం విశ్వాసం కుదిరి, నాయకులు తమ కీచులాటలను తగ్గించుకుని నడిపించగలిగిననాడు సహకార నిరాకరణ ఉద్యమంకూడా విజయవంతం అవుతుందని 1923 నాటి నాగపూరు జెండా సత్యాగ్రహ సమరం రుజువు చేసింది.

  1. తరవాత (1967) వకీలుగా తూర్పుగోదావరిజిల్లా రాజోలు కాపురస్థులు.