పుట:Naajeevitayatrat021599mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii

అయితే, ఆ మంత్రివర్గం ఒక్క సంవత్సరంకన్న నిలవలేక పోయింది. తమ నాయకత్వంలో రెండవస్థానం నాది అని ఎప్పుడూ ప్రకాశంగారి విశ్వాసం. అ విశ్వాన్ని నిలుపుకోవడానికి నేను నా శక్తివంచన లేకుండా పనిచేస్తూ, ఆయన ఆశయాలను, ప్రభుత్వం నడపడంలో ఆయన విథానాలను బలపరుస్తూ ఉండేవాణ్ణి. వాస్తవంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ పిత అయిన ఆ మహానాయకునిపట్ల ఈ విధంగా, గాఢ కృతజ్ఞతాభావంతో నా ఋణం తీర్చుకున్నాననే సంతృప్తి నాకు ఉంది.

ప్రకాశంగారు ఎప్పుడూ దూరదృష్టిగల ప్రజానాయకుడు. సామాన్య ప్రజల సౌకర్యాలు, శ్రేయస్సు ఆయన నిరంతర ధ్యేయాలు. అందుకే, ప్రకాశంగారిపట్ల ఆయన జీవితం పొడుగునా ప్రజలు అపారమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించడంలో ఆశ్చర్యమేమి లేదు.

ప్రకాశంగారు తమ జీవిత కాలంలోనే భారత స్వాతంత్ర్యం సిద్ధించడం, సర్వతంత్ర స్వతంత్ర గణతంత్రంగా ప్రకటించటం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ప్రాప్తించటం-అన్నీ స్వయంగా చూసి, ఏళ్ళు నిండిన పండు వయస్సులో , పరిపూర్ణ గౌరవాలతో పరమపదించారు.

ప్రకాశంగారి నిర్భీకత, నిస్వార్థ త్యాగశీలం ఎప్పటికన్న ఎక్కువగా ఈనాడు మన దేశీయులకు అవశ్యక సుగుణాలు. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర తరతరాలుగా మన యువజనులకు ఉత్తేజం కలిగించగల దనటంలో నా కేవిధమైన సందేహం లేదు.

రాష్ట్రపతి భవన్
6-7-1972
(సం) వి. వి. గిరి
భారత రాష్ట్రపతి