పుట:Naa Kalam - Naa Galam.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


డాక్టర్ అంబేద్కర్‌తో ఇంటర్‌వ్యూ

Naa Kalam - Naa Galam Page 62 Image 0001

1951 చివరలో నా జీవితంలో మరపురాని గర్వకారణమైన సంఘటన జరిగింది. అది నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌తో ఇంటర్‌వ్యూ. అప్పటికి రాజ్యాంగ రచన పూర్తి అయింది. స్వతంత్ర భారత తొలిప్రభుత్వంలోని తన న్యాయశాఖ మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో నిమ్న జాతుల మహాసభలో పాల్గొనడానికి వెడుతూ మార్గం మధ్యలో గన్నవరం ట్రావెలర్స్‌ బంగాళాలో ఆగారు. అప్పుడు నేను "ఆంధ్రపత్రిక" దినపత్రికకు గన్నవరంలో విలేకరిని.

నవ భారత రాజ్యాంగ నిర్మాత గన్నవరం వస్తున్నారంటే, ఎక్కడలేని సంచలనం. ఇప్పటివలె అప్పట్లో తీవ్రమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసుల హడవుడి ఏమీ వుండేవి కావు. అందువల్లనే, 1951 చివరలో నేను సాక్షాత్తూ దేశ ప్రధాని నెహ్రూను విజయవాడ రైలు స్టేషన్‌లో సులభంగా కలుసుకుని స్వయంగా మాట్లాగలిగాను.

బాబా సాహెబ్‌ను గన్నవరం టి.బిలో కలుసుకుని, నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

నవ భారత రాజ్యాంగం ముసాయిదాను దాదాపు ఒంటరిగా రూపొందించినందుకు ఆయనను అభినందించాను. ఆయన చిరునవ్వు నవ్వారు.

"మీరు రచించిన రాజ్యాంగం ప్రకారం జరిగే తొలి ఎన్నికల వరకైనా (1952) మీరు కేంద్రంలో న్యాయశాఖమంత్రిగా వుంటే బాగుండేదని" నేను