పుట:Manimalikalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


26. శిశిరమొచ్చింది మరి
      తుమ్మెదకిక సాపాటుక్కరువే

27. గోరింట రాలాక అందమిస్తుంది
     చిత్రం వరిపంట కూడ రాలాకే ఆకలి తీరుస్తుంది

28. అరచేతిలోనే చందమామ ఎర్రగా
     పాపాయి నిద్రిస్తోంది ఆదమరచి

29. అడవిలో ఎర్రపూల తురాయిచెట్టు
     అందమంతా అడవిపాలంటే అర్ధమయ్యేట్టు

30. నువ్వూ నిద్రా రెండూ ఇష్టమే
     నిన్ను కలలో తెస్తుందమ్మా నిద్ర

31. ఏంటో నువ్వెళ్ళిపోయావ్‌
     నీ తలపులు మిగిల్చిన విషాదం నాతోనే ఆపి

32. మర్రిచెట్టు విస్తరిస్తూనే ఉంది
     నేలరాలిన ఆకుమాత్రం గొణుక్కుంటూనే

33. పిచ్చిదారం పూలకు బంధాలల్లుతోంది
     పూలు వాడి రాలిపోతూ దారం ఏకాకిగా మిగిలిపోతూ

34. రాత్రి కొండమీంచి దూకాడేమో సూరీడు
     గాయాలతో పొద్దున్నే వచ్చాడు ఎర్రగామండుతూ

35. ఉదయాన్నే చల్లనిగాలి
     రాతిరి జాబిలి వదిలిన వెన్నెలదేమో