Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

65


శ్రమమును నిర్మించి నిర్వర్తించుచు సకల జనులకు సర్వవిషయములు చెప్పుచున్నాఁడు. నీ వాతని నాశ్రయించి తగిన విద్యలను గ్రహించి ర"మ్మని పంపెను.

శని విద్యార్థియై విప్రబాలవేషమును ధరించి బృహస్పతి యున్న కడ కేతెంచి యాతనికి సాష్టాంగ మెఱఁగి తాను కపిలవంశీయుఁడ ననియు జ్ఞాన మాశించి వచ్చితి ననియుఁ దనకు సర్వవేదశాస్త్రములు బోధించి జ్ఞానము నొసంగు మనియుఁ బ్రార్థించెను. వాచస్పతి యానందించి శిష్యునిగాఁ జేర్చుకొని యాతనికి సర్వవిషయములు చక్కగ నేర్పెను. ఆతఁ డనతికాలముననే విద్యార్థుల కెల్ల మిన్నయై బుద్ధివిశారదతను గురుహృదయ మాకర్షించెను.

ఇంత బుద్ధిమంతుఁడు వీఁ డెవఁడా యని బృహస్పతి యొకనాఁడు దివ్యదృష్టిని జూడ నాతఁడు సూర్యతనయుఁ డగు శనై శ్చరుఁ డని స్పష్టముగాఁ గాననయ్యెను. బృహస్పతి యాతనిం బిలిచి " నీ వసత్య మాడి నా వలన విద్య అభ్యసించితివి. ఆ దోషమువలన నీకుఁ గ్రూర దృషియు, సర్వజనపీడాకరుఁ డను దుష్కీర్తయుఁ గలుగు నని శపించెను. అది విని శని “నాపీడ నీకును దప్ప" దని ప్రతిశాపమిచ్చి "ఏమైనను, నీవు నాకు గురుదేవుఁడవు. కాన, నాపీడ నీకుఁ బ్రమాద హేతు వెంతమాత్రము కాకుండు” నని పలికి బృహస్పతిని బ్రీతునిఁజేసి వెడలిపోయెను.

బృహస్పతిశాపమువలన శని పాపగ్రహము, క్రూరదృష్టి యుతుఁడు నయ్యెను. శని ప్రతిశాపమువలన నొకనాఁడు బృహస్పతికి రాజశిశుహంత యను నిరాపనింద రాఁగా నాతని కా దేశపురాజు మరణదండన విధింవవలసియు నేమియు ననలేక విచారించుచుండెను. ఇది యంతయు శనిగ్రహదోష మని బృహస్పతి మనమున శనిని ధ్యానింపఁగా నాతఁడు గురుని గౌరవించి యాతఁడు నిర్దోషి యనియు, రాజ శిశు వూయెలలో సురక్షితుఁడై యున్నాఁడనియు నశరీరవాణిచే వెల్లడింపఁజేసెను. బృహస్పతిని రాజు మంత్రులు నెల్లరు గౌరవించి క్షమాభిక్షము కోరిరి. "ఇది మీ తప్పుకాదు. ఎంతటివారికిని శనిపీడ