________________
మదిలోని మాట
మాతృదేవోభవః పితృదేవోభవః ఆచార్యదేవోభవః నా వెనుకనుండి నన్ను “సాహితీ రంగానికి” నడిపించిన వీరికి ముందుగా నా అక్షరాంజలి తెలియజేసుకొంటున్నాను.
అమ్మ గోరుముద్దలు పెడుతూ నా చిన్నతనాన చెప్పిన కథలు, నాన్నగారు వారి జీవనయాన ప్రారంభంలో రాసిన కథలను (ఫైలులో) చదివి, నాకు ఇంగ్లీష్ బోధించిన గురువుగారు, శ్రీ కొండముది శ్రీరామచంద్రమూర్తిగారు (ప్రఖ్యాత రచయిత), వారీ శ్రీమతి రుక్మిణీదేవి ఇంగ్లీష్ పాఠాలతోపాటు వారి సాహిత్యం గురించి చెప్పటంతో కలిగిన ఆసక్తితో వివిధ కథలను, నవలలను ఇష్టంగా చదవటం జరిగింది. నేను చదివిన మొదటి కథ “ఆంధ్రజ్యోతి' వారపత్రికలో సీరియల్ గా వచ్చిన శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి “జీవనతరంగాలు”. అలా అమ్మ ద్వారా కథలువింటూ, నాన్నగారిద్వారా అధ్యయనంచేసి, గురువుగారు కలిగించిన ప్రేరణతో చిన్న చిన్న కథలను, కవితలను రాయటం మొదలుపెట్టాను.
వివాహమైన తరువాత మచిలీపట్నం నుండి నేను పాల్గొన్న ఘంటసాలవారిపై రాష్ట్రస్థాయిలో జరిగిన వ్యాసరచన పోటీలో ప్రధమస్థానం రావటంతో నా కలానికి పదును పెట్టడంజరిగింది. మా వారికి విజయనగరం బదిలీకావటంతో, అక్కడి సాహితీ మిత్రులు, శ్రీ చీకటి దివాకర్ గారు, శ్రీ ఆర్.బి. రామానాయుడుగారు, చాగంటి తులసిగారు మొదలైన వారి ప్రోద్బలం, సహకారంతో నా రచనా ప్రక్రియ పరుగులు తీసింది. అచ్చటి నుండి రాజమండ్రి చేరిన నేను శ్రీ బులుసు సత్యనారాయణగారు, శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం గారు వంటి సాహితీ పెద్దల అండతో నా రచనలకు మెరుగులు దిద్దుకొన్నాను. 2016 మహిళా దినోత్సవం నాడు విజయనగరంలో ఐదుగురు రచయిత్రులం కలసి “నేలతల్లి పొత్తిళ్ళలో' అనే కవితా సంకలనాన్ని వెలుగులోనికి తెచ్చాము. అది నా తొలి పుస్తక ప్రచురణ. అదే సంవత్సరం నవంబరు 30వ తేదీనాడు రాజమండ్రిలో “మధు పత్రాలు” అనే కవితా సంపుటిని నేను వ్రాసిన 60 కవితలతో పుస్తకరూపంలో, నా రెండవ ప్రచురణగా తీసుకు వచ్చాను. గత 10 సంవత్సరాలుగా నా కథలను, కవితలను “ఆంధ్రభూమి” ఆదివారం నాడు వచ్చే “మెరుపు” శీర్షికలోను, విజయనగరం నుండి వెలువడే భక్తిసమాచారం, గోపురం మాస పత్రికలలోను, పిల్లల కథలు “బాలభారతం”, “బాలబాట” “బాలసుధ” మాస పత్రికలలోను ప్రచురితమైనాయి.