పుట:Kumbharaana020881mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకటి] కుంభ రాణా 3

అర్చకుఁడు : పూజల పనేగాని ఒక్కరూక కూడ పడడములేదు తీర్థపాత్రలో.

[వెంకయ్య సుబ్బయ్య అను ఇద్దఱు యాత్రికులు ప్రవేశింతురు.]

సుబ్బయ్య : [దేవాలయ స్తంభములు తక్కిన విశేషములు చూచుచుండును.]

వెంకయ్య : ఓయ్, శనిపిశాశమా, యిట్టసూడు దేవుణ్ణి. బుద్ది, బుద్ది. [చెంపలు వేసికొని] మనకా యింటికాడి కూఁతలే వస్తాయి దేవళాల్లో కూడాను. దేవుణ్ణి శేవించు.

సుబ్బ : ఆ - శేవించాంగా మఱి. దూరాపుకొండలు నునుపన్నారు పెద్దోళ్ళు. ఈసంబరానికా మఱి నన్ను గోదారినుండి ఏంటేంటో శెప్పి యింతదూరం లాక్కొనొచ్చావు ? ఇంతదూరం వచ్చాంగా యెంత పెద్ద గాలిగోప్పరం వుంటుందో అని ఆశపడ్డాను. శ్రీరంగ దేవళంలో నూరోవంతుకూడాలేదు. దాని తస్సాదీయ ఆస్తంబాలకేశి చూస్తే తలగుడ్డ కింద పడ్డాది. యెంకయ్యా, యీశిత్తరం చూశావా ? ఇంత జగప్పెళయంగా తిరునాళ్ళ జరుగుతుంటె ఒక్క జంతరిజంతరిపెట్టె కూడాలేదు. ఒక్క రంకలరాటమైనాలేదు. అదేంసూశావు, ఒక్క సుట్టపొవ్వాకు అంగడికూడా లేదు.

వెంక : ఆ, బేష్, మాబాగాశెప్పావురా సుబ్బన్నా ! ఎంత పెద్దగాలిగోపురం వుంటే అంత పెద్ద మహత్తెం గల్ల దేవుడుంటాడాయేం? ఇక్కడ మహత్తెమంతా ఆమీరాబాయమ్మగారిదే. అందుకోసమే దేశ దేశాలనుంచి జనం తేరుమోకు తీశినమల్లె వస్తుంటారు. ఒక్కసారి ఆతల్లి పాటవింటే మనజన్మం తరిస్తుందంట. ఆమె యీ పట్న మేలే రాణాగారి పట్టపుదేవంటారు.