పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97

కొప్పరపుకవులార మీ గొప్పతనము
నింతయని వర్ణనముసేయ నెవరితరము?
కాని నాచేతనయినంత గాను నాదు
సంతసంబును వెల్లడి సల్పుకొంటి.

శ్రీమాన్ వింజమూరి రంగాచార్యులుగారు

నలువ ముఖంబుల నెప్పుడు
నలువుంగను పలుకు చెలువ నలువకొలంబన్
కలశోదధి కిందు లనన్
మెలఁగుట భావ్యంబెకాన మీకడ మెలఁగున్

శతఘంటకవనమ్ము సల్పఁజూచినయెడ
          మూర్తికవులటంచుఁ బొగడవచ్చు
అష్టావధానమ్ము నాచరింపఁగఁజూడ
          వేంకటార్యులటంచుఁ బిలువవచ్చు
ఆశుధారాకవిత్వాధిక్యమును జూడ
          నలపెద్దనకవీంద్రు లనఁగవచ్చు
ముద్దుముద్దుగఁ జెప్పు ముఖ్యస్థితిని జూడ
          దిమ్మనకవులంచుఁ దెలియవచ్చు

సంస్కృత శ్లోకమున కాంధ్రసరణిఁ దెల్ప
నల్ల శ్రీనాథకవిరాజు లనఁగవచ్చు
నహహ! యేవిషయముఁ జూడ నత్యధికులు
ననఘులగు కొప్పరపు కవులండ్రు బుధులు

అరయశతావధానముల నంచితరీతిని జేయనేర్తుమం
చఱచెడివారు కొందఱనినట్టులఁ జేయరు సత్కవిత్వ సుం
దరియును ధారణాసతియుఁదత్పరతన్ మిముఁబొందిరెందునన్
దరుణులు వృద్ధులన్‌విడి ముదంబున యౌవనులందుటబ్రమే