పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రాష్ట్రపక్షముననే పూర్ణహృదయులై భాషించిరి. ఇట్లు బెజవాడలో ఆంధ్రరాష్ట్రనిర్మాణ మవశ్యమని చెప్పిన మహాసభ విశాఖపట్టణములో ఆంధ్రరాష్ట్రము నిర్మించవలసినదని ప్రభుత్వమును కోరుచు తీర్మానించెను. ఆర్టుకళాశాలలను, ఇంజనీయరింగు కళాశాలలను నిర్మాణముచేయించవలె నను మరికొన్నితీర్మానములు చేసి, సభ ముగించిరి. నాల్గవమహాసభను కాకినాడవారాహ్నానముచేసిరి.

ఆంధ్రమహాసభకు స్థాయిసంఘ మొకటి ఏర్పరచబడినది. దానిలో శ్రీ మోచర్ల రామచంద్రరావు, వరహగిరి జోగయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రభృతులు సభ్యులుగా నుండిరి. నన్ను ఆసభకు కార్యదర్శిగా నెన్నుకొనిరి. ఆ కార్యదర్శిపదవినిబట్టియే నేను దేశమున ప్రచారముసల్పుచుంటిని.

విశాఖపట్టణసమావేశము ముగిసినపిదప నేను ఉదకమండలమునకు వెళ్లితిని. అంతకుముందే శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మ, శ్రీ మోచర్ల రామచంద్రరావు మొదలగువారు అక్కడికి వెళ్లియుండిరి.

ఆ ప్రాంతమున పోకచెట్లు విస్తారముగా గన్పట్టుచుండెను. ఆ సుందర దృశ్యము కనులు చల్లజేయుచుండెను. నీలగిరుల నెక్కుటకు ప్రత్యేకముగ రైలుమార్గ మేర్పడియుండెను. ఆబండికి వెనుకను ముందును ఇంజెన్లు తగిలించిరి. బండి వెనుకకు జారిపోకుండునట్లు చక్రములకుపండ్లు ఏర్పరచిరి. ఉదయమున కొండప్రయాణము చేసినపిమ్మట నాకు ఒడలుత్రిప్పి, వమనమగునట్లు బాధకలిగెను. తోడిబాటసారి దాక్షిణాత్యబ్రాహ్మణు