పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మర్తి లక్ష్మీనరసింహముగారు తెలుగున భాషించుచు వారు గావించిన ఉపన్యాసములను తీవ్రముగ విమర్శించి సర్వవిధముల ఆంధ్రజనాభ్యుదయమునకు బలిష్టసాధనమైన రాష్ట్రనిర్మాణమును గూర్చిన ఆందోళన సంకుచితదృష్టితో చేయబడుచున్నదనుట సమంజసముకాదనియు, మన యల్పబుద్ధిని ప్రకటించుటయేయని మేఘగర్జనముచేసినట్లు ఎలుగెత్తి వాక్రుచ్చిరి. స్వార్ధప్రియులమై మనము మిన్నకుండి దేశమున కుపకారముచేయబూనినవారి యత్నమును నిరసించుట అన్యాయమని సహేతుకముగను నిర్భయముగను, నిర్మొగమాటముగను వక్కాణించిరి. శ్రీ సుబ్బారావుపంతులుగారు రెండుమూడువాక్యములలో నేను ఉపన్యసించినందుకు సభాపక్షమున కృతజ్ఞతతెల్పి సభముగించిరి.

శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముపంతులుగారు ఆంధ్ర కవీశ్వరులై, అనేకకావ్య నాటకములను, నవలలను, రచించి ప్రఖ్యాతిగాంచిరి. వీరు సంఘసంస్కరణాభిమానులు, దేశాభిమానులునై, జాతీయపాఠశాలను స్థాపించిన మహనీయులు. వీరు అంధులయ్యు దేశహితైకకార్యములందు మిక్కిలియుత్సహముతో పాల్గొనుచు, వీరేశలింగముపంతులుగారి వితంతు శరణాలయసంబంధములగు కార్యములందును తోడ్పడుచుండిరి.

ఆంధ్రరాష్ట్రప్రచారమునకై కాకినాడలో దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారి ఆధిపత్యమున మహాసభ నడిచినది. పిఠాపురముజమీందారుగారి కళాశాలలో కొందరు ఉపాధ్యాయులును, న్యాయవాదులుమొదలగువారును సభకు హాజరైరి.