పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పితృవియోగము

నేను అరండల్‌పేట కాపురము చేయనారంభించినప్పటి నుండి మాతండ్రిగారు నాయొద్దనే యుండి పంచలో ఆనుడుకుర్చీ మీద కూర్చుండి తెలుగుఅర్థములుగల భగవద్గీతాగ్రంధము చేతబట్టుకొని చదువుకొనసాగిరి. పెద్దలైనకొలది వారియందు ఉదారభావములు హెచ్చగుచుండెను. తనక్రింద నుంచుకొన్న వెయ్యి రూపాయలలో మాయింటియొద్ద వీధిలో సర్వజనులకు నుపయోగించున ట్లొక నీటికొళాయిని కట్టుటకు సుమారు మున్నూరు రూపాయలుదానమిచ్చిరి. తక్కిన ద్రవ్యమునుగూడ కొత్తగుంటూరులో కూరలమార్కెటుకు సమీపమున పశువులు నీరుత్రాగునిమిత్తము తొట్టెకట్టించవలెనని సంకల్పించిరిగాని మునిసిపాలిటీవారు అభ్యంతరముచెప్పుటచే ఆప్రయత్నము సాగకపోయెను. ఇంతలో మాతండ్రిగారి కొకమధ్యాహ్నము ఆకస్మికముగ మూత్రవిసర్ఝన కట్టుబడిపోయెను, సూదిగ్రుచ్చి నీరుడుతీయవలసివచ్చెను. డాక్టర్లు దానిని నివారణచేయలేకపోయిరి. చికిత్సచేయవచ్చిన డాక్టరు మాయింటికి చిరపరిచితులుగాన ఆయనతో "ఈసారి నన్ను లేవదీయుటేనా" యని మాతండ్రిగారు హాస్యముగ బలికిరి. వేడినీళ్ళుబోసిన గంగాళములో కూర్చుండబెట్టి చూచితిమి. కాని మూత్రముకాలేదు, మృత్యువు ఆసన్నమైనదని యెఱిగియేకాబోలును కుమారులు మువ్వురును బిలిచి తామీలోకమును విడిచిపోవుచున్నా మనియు, మీరు మువ్వురు అన్యోన్యప్రేమతో మెలగుచుండు డనియు చెప్పి, నాతమ్ము లిద్దరికి నన్ను నమ్మి ప్రవర్తించవలసినదని నుడివిరి. "నాన్నా మీకు