పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


డగుటచేత బందరులో నున్న జిల్లాసంఘముతో ఆయనకు సంబంధము లేదయ్యెను. నేను త్వరలోనే జిల్లాసంఘమునకు కార్యదర్శిగా నెన్నుకొనబడితిని. 1896 సంవత్సరమున కాబోలును కృష్ణ వరదలవలన అవనిగడ్డతాలూకా గ్రామములు నీళ్ళలో మునిగిపోయి ప్రజలు కృష్ణానదిపొడుగున కట్టలమీదను చెట్లమీదను, దిబ్బలమీద నెక్కి ప్రాణములు రక్షించుకొనిరి, పశువులు మొదలగు ఆస్తి చాలవరకు వరదలో కొట్టుకొనిపోయెను. ప్రజలు తినుటకు తిండిలేక పసిపిల్లలతోను, ముసలివారితోను, రోగులతోను పడరానిపాట్లు పడిరి. అప్పుడు నేను బందరులో చందాల నిమిత్తము తిగినను రు 130 ల కంటె ఎక్కువ వసూలు చేయలేకపోతిని. బస్తీవాసులకు కష్టపడుప్రజలపై సానుభూతి మృగ్యముగ నుండెను. అట్టి వసూలునిమిత్తము ఎవరైన సర్కారుఉద్యోగి పూనినయెడ గొప్పగా ద్రవ్యసహాయము చేసియుందురు. అంతియే కాని సామాన్యు లెంత యత్నించినను బస్తీ వాసుల హృదయములు చలింపవని తేలినది.

ఆ వచ్చినసొమ్ముతో బియ్యము, ఉప్పు, మిరపకాయ, చింతపండు కొని పడవమీద వేసుకొని, నాగుమాస్తాను తోడు దీసికొని, బందరువరకు వరదనీరు నిలచియుండుటవలన ఆనీటిమీదనే పడవ సాగించుకొనిపోయి కొందరికి ఆవస్తువులను పంచిపెట్టి ఏదో కొలదిసహాయము చేయగలిగితిని. నిజమైన సంతుష్టి లేకపోయెను. స్వయముగ శరీరకష్టము చేయగలిగితినేగాని ద్రవ్యము వెచ్చించు అవకాశము లేకపోయెను. ఆసంవత్సరమే మద్రాసుగవర్నరు వచ్చినపుడు కాంగ్రెసుకమిటీతరపున సన్మాన