పుట:Konangi by Adavi Bapiraju.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“జర్మనీ వస్తుంది. కాని రష్యాకు ఇతర సామ్రాజ్యవాదులు సహాయం చేయకపోతే రష్యా నాశనం అవుతుంది.

“జర్మనీకి రష్యాకు ఇప్పుడు స్నేహంకాదా? రష్యాలోని ప్రజాశక్తి ఎవరు తనపై పడినా కాచుకో కలదయ్యా?”

కోనంగి: ఏమిచేస్తాడు భారతీయు డీ ప్రపంచంలో! భారతదేశానికి స్వరాజ్యం కావాలా అక్కరలేదా? స్వరాజ్యం కావలసివస్తే గాంధీజీ చూపించిన దారి ఉత్తమముకాదా? తాము స్వరాజ్యం సంపాదించుకొన్న తర్వాత ఇతర సమస్యలు చూచుకోడం మంచిదికాదా?

డా: అవునయ్యా. నువ్వు చెప్పినదాంట్లో అర్థం లేకపోలేదు. మన స్వంత భూమి సంపాదించుకొనేటప్పుడు, ఏలాంటి వ్యవసాయం చేయదలచుకొన్నామో నిశ్చయించుకోవద్దా?

కోనంగీ: అదేమింటండీ అలా అంటారు? మనం ఇంటిస్థలంకోసం వ్యాజ్యం వేశాము. ఆ స్థలం మనదైన తర్వాతగదా ఏలాంటి ఇల్లు కావాలో నిశ్చయించుకొనేది. పొలం మన స్వాధీనమైనతర్వాత ఎలాంటి వ్యవసాయం చేయాలో నిశ్చయిస్తాము. మొదట స్వరాజ్యం రానీయండి చూద్దాం.

డాక్టర్: గాంధీగారి పద్దతివల్ల స్వరాజ్యం రాదనే నా ఉద్దేశం.

ఎందుకంటే గాంధీగారిని మాయచేసి భారతీయ పూంజీదారులు కాంగ్రెసుకు మద్దతు చేస్తున్నారు. వారి స్వలాభంకోసం భారతదేశాన్ని ఇంగ్లండు నుంచి పూర్తిగా విడిపోనియ్యరు.

కోనంగి డాక్టరుగారితో వాదించడం కష్టమనుకొన్నాడు. కాంగ్రెసులో బిర్లాలున్నారు. అంబాలాలు, సరాభాయిలున్నారు. వారు కోటీశ్వరులే! కాని వారి ధనాశతనం మానుకొన్నారా?

కాంగ్రెసు నాయకుడైన జవహర్ లాలు నెహ్రూకూడా సాంఘికవాది అయ్యాడు. అయినా ముందర కాంగ్రెసులో నాల్గణాల సభ్యుడవడం తన కర్తవ్యం అనుకున్నాడు. తాను హెూటలు గుజరాతులో సంపాదించుకొన్న ఆ కొద్ది రూపాయలు పెట్టి ఖద్దరు కొనుక్కున్నాడు.

అనంతలక్ష్మి ఇంటిమూల పడివున్న వార్ధాచరఖా వడకడం ప్రారంభించాడు. ఇంతలో తాను సినిమాలో చేరడం వచ్చింది.

డాక్టరు రెడ్డిగారు రష్యాను గురించి గ్రంథాలన్నీ తన్ను చదవమన్నారు. అవి కూడా చదవడం ప్రారంభించాడు. మార్కుృగారి 'పెట్టుబడి మూలధనం' చదవడం సాగించాడు. అనుమానాలు డాక్టరుగారి నడగడం! ఈలా మార్చి నెలాఖరుకు ఆ పుస్తకం పూర్తిచేశాడు. లెనిన్గారి గ్రంథాలలో “సామ్రాజ్యతత్వ విమర్శనము” అనే గ్రంథం చదివాడు. “మార్క్సిజం” అనే గ్రంథం మొదలు ఇరవైనాలుగు సంపుటాల గ్రంథాలున్నాయి. కోనంగి అవన్నీ కూడా చదవడానికి నిశ్చయం చేసుకున్నాడు.

ఒకవేళ తాను ఒక పెద్ద రాజకీయనాయకుడైపోతే! ఇంకేముంది? ఎవరు భరిస్తారు? ఊరేగింపులూ, పూలమాలలూ, జయధ్వానాలున్నూ! ఇంక వూరికే ఉపన్యాసాలిస్తూ వుండాలి కాబోలు, జైలుకు వెళ్ళడం ప్రారంభించాలి కాబోలు. ఇదో ఇబ్బందే. తన తల్లి దుఃఖిస్తుంది. అదో రకం జీవితం క్రింద మారుతుంది. అదృష్టంకొద్దీ తల్లి ఒక విగతభర్తక అయిన ధనవంతురాలింట వంటలకుగా చేరింది. తానేమో పెద్ద ఉద్యోగంచేసి తన్ను