పుట:Konangi by Adavi Bapiraju.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“అంతకన్న ఏం కావాలి మణీ! సరే: నేను వెళ్ళి కొన్నాళ్ళపాటు నల్లతంబి నెల్లూరు హూటలులో ఉంటాను. ఈ బూర్జువాల ప్రతాపం అంతా మనబోటి హెూటలు కుఱ్ఱవాళ్ళమీదే! ఈలాంటి బూర్జువాలను చేపల దండలులా గుచ్చే సామ్రాజ్యవాదులు వస్తే ఈదద్దమ్మలు తమ కాళ్ళకు ఎంత బలం ఉందో పరీక్ష చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇక సెలవు, మనం కలుసుకుంటూ ఉందాం. గాంధీమహాత్మాకీ జై! బూర్జువాలు మురదాబాద్!” అంటూ ఒక రిక్షా చేసుకొని నల్లతంబి నెల్లూరు హెూటలు చేరుకున్నాడు.


పంచమ పథం

రాజకీయాలు

కోనంగి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీకీ వెళ్ళడానికి అనంతలక్ష్మి బయటకు వచ్చింది. కోనంగి లేడు. అతడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ బాలిక గుండె గుభిల్లుమంది. పదిహేడేండ్లు నిండి, పద్దెనిమిది సంవత్సరాలు జరుగుతూ అప్పుడే విప్పారే కమలపుష్పమా బాలిక. ఆమె అలాగే తెల్లబోయి నిలుచుంది. కళ్ళనీళ్ళు తిరిగినవి. తాను సరదాకు కోపగించి వేడితే, నిజమనుకుని వెళ్ళిపోయినాడు.

కాలేజీ మాని, హెూటలు గుజరాతుకు వెళ్ళి పట్టుకుందామని. తిన్నగా కారు వేసుకొని, హెూటలు గుజరాతు పక్కనుండే ఒక బట్టలషాపులోకి పోయిడైవరును కోనంగి కోసం పంపింది. అతడు తిరిగివచ్చి కోనంగిని యజమాని పంపివేశాడనీ, అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిపినాడు.

అంతటితో అనంతలక్ష్మికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. ఆమెకు కోనంగిపైనా, సర్వప్రపంచం పైనా కోపం వచ్చింది. కారు తిన్నగా క్వీన్ మేరీస్ కాలేజీ హాస్టలుకు పోనిమ్మని అక్కడకు పోయింది. హాస్టలు పరిచారికను పంపి తనకు భరించలేని తలనొప్పి వచ్చిందని చెప్పి ఒక స్నేహితురాలి గదితాళం తెప్పించుకొని, ఆ గది తలుపుతీసి, అనంతలక్ష్మి ఆ అమ్మాయి మంచంమీద పడుకొంది.

చిన్నతనాన్నుంచీ కోరిన వస్తువు తెప్పించి ఇచ్చాడు తండ్రి. ఆ బిడ్డకోసమే తల్లిదండ్రులు బ్రతికినారు పండితులచే సంగీతం చెప్పించారు. ఆ వస్తువు బాగుందంటే తండ్రి కొన్నాడు. ఆ బొమ్మ కావాలంటే తల్లి కొంది. ఆ బాలికకోసం సాలుకు మూడు నాలుగు వేల రూపాయలు బట్టలకూ, రెండు మూడు వేల రూపాయలు బొమ్మల సామానులు మొదలయిన వాటికి ఖర్చయ్యేది.

అలాంటి తనకు, ప్రేమించిన ఒక బాలకుడు ఇంత దూరం అవడం ఏమిటి? అతడు దూరమయ్యాడన్న భావం ఆమెకు మరింత ఆవేదన తెచ్చి పెట్టింది. చెట్టియారు అల్లుడు కావాలని తల్లి కోరిక. ఎంత అసహ్యకరమైన కోరిక. తనకు ఇష్టంలేక తల్లి ఏ పనీ చేయదని అనంతలక్ష్మికి తెలుసును. ఎందుకు తనకీ అవేదన? ప్రతిబాలికా ఎవరినో ఒకరిని ప్రేమించి అతని కోసం ఈలా బాధలు పడుతుందా? జీవితాన్ని తలక్రిందులుచేసే సంఘటన వస్తే మనుష్యులు బాధ పడతారు. రానంత సేపూ ఆనందంగానే ఉంటారు జనులు.