పుట:Konangi by Adavi Bapiraju.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ వార్త రెండురూపాయలన్నర మొదటి తరగతిలో కూర్చున్న వైట్వే కంపెనీ మేనేజరుగారికి తెలిసింది.

ఆ మేనేజరు స్టూఆర్టు గారు తన దగ్గిర తాబేదారుడైన కోనంగిని సారాను అప్పుడే ఆనవాలుపట్టి పళ్ళు బిగించి ఉన్నాడు. కోనంగి అంబరెల్లా పేట రాజకుమార్ అని తనకు తెలిసిందికాదే! అని అనుకున్నాడు ఆశ్చర్యపడుతూ. దీపాలు ఆరిపోయి చిత్రదర్శనం అయినప్పుడల్లా సారా కోనంగి దగ్గిరగా ఒదిగిపోయేది. అతని చెంప ఒత్తుకునేది. అతని చేయి తన నడుము చుట్టూ తిప్పుకునేది. అతనిచేయి తనగుండెలకు అదుముకునేది.

కోనంగి రక్తం పరవళ్ళెత్తింది. అతనిగుండె పంజాబ్ మెయిల్ వేగం తొల్చింది. నెమ్మదిగా సారాను దగ్గరకు తీసుకొని కోనంగి ఆమె పెదవులను అస్పష్టంగా స్పృశించాడు. బొమ్మలో ప్రేమదృశ్యమూ, కౌగిలింతలూ చుంబనాలూ వచ్చినప్పుడు వీరిద్దరూ జల్ జల్ మనేవారు.

చిత్రం ఎలా పూర్తిఅయిందో అయింది. సారాయున్నూ కోనంగిన్నీ టాక్సీ ఒకటి పిలిచి అందులో ఎక్కబోయే సమయంలో స్టూఆర్టు గారు వీరికి కనిపించాడు. సారా అస్పష్ట వాక్యాలతో “కొంపలు మునిగినాయి కోన్!” అని అన్నది

ఇద్దరూ కారులోకి దూకారు. కారు సాగింది. కొంతదూరం పోగానే సారా కోనంగిని గట్టిగా కౌగలించుకొని అతని మోమంతా ముద్దులు కురిపించింది.

కోనంగి అతిపురుషుడై సారాను నలిపివేశాడు. అతడు ఇంతవరకు యాదాలాపంగా స్త్రీలను స్పృశించడమే కాని, ఈ రీతిగా కాంక్షతో, గాఢతమితో తన కౌగిలిలో అదిమివేయడం ఎరగడు.

మాంచి ఘాటుఎక్కిన చాంపేను ద్రాక్షసారాయి త్రాగినపోరులా వారిద్దరూ సారా ఇల్లు చేరారు, సారా తనలో ఉప్పెనలా విరుచుకు పడుతూ ఉన్న కామకాంక్షతో కోనంగిని తీగలా అల్లుకుపోయి, “ఈ రాత్రి ఇక్కడ ఉండిపో కోనంగీ.!” అంది.

కోనంగి ఘట్టిగా సారాను తన హృదయానికి అదుముకొని ముద్దులు కురిపించి ఆమెను వదిలి, అక్కడ వున్న కుర్చీపై కూర్చుండబెట్టి డగ్గుత్తికలు మింగి, తలవూపి ఇటూ అటూ తిరిగి అక్కడ వున్న గ్లాసుతో కూజాలోని మంచినీళ్ళు త్రాగి, సారా ఎదుటకు వచ్చి నిలుచుండినాడు.

“సారా! నాకు ఒళ్ళు వేడెక్కి ఉన్నమాట నిశ్చయం! కాని, నేను... పెళ్ళి... లేకుండా... స్త్రీలతో... స్త్రీపురుష సంబంధం... పెట్టుకోలేను.”

“అలాగా, కోన్!”

కోనంగి సారా తలపట్టి నుదురు చుంబించి, ఆమె మేడమెట్లు దిగి జర జర నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. అతని వెనక నెమ్మదిగా ఒక కారు కొంతదూరం సాగి వెనక్కు తిరిగి సారా యింటికడకు పోయి అగింది.

కోనంగి నడిచి, నడిచి, అనంతమైన ఆలోచనలు మెదడులో సుడిగుండాలు, సుడిగాలులు తిరిగిపోతూ ఉండగా నడిచిపోయాడు.

తానూ అచ్చంగా ఆంధ్రుడే. ఒక వరూధిని వచ్చి “ఓ సుందరకోనంగీ కుమారా! నాతో మన్మథసామ్రాజ్యవు చక్రవర్తివై ఏలుదువు రమ్ము. నా హృదయమున వ్రాలుము! ఈ అతనుడు కోయని ఆర్చి పుంఖాను పుంఖములుగ తన నిశిత కుసుమసాయకముల పరచి నా హృదయమును తూటుపడ వేయుచున్నాడు. హా రక్షింపుము!” అని విరహతాపాన