పుట:Konangi by Adavi Bapiraju.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నేనూ మా గురువుగారూ కలిసి ఎన్నో పుస్తకాలు చదివినాము.”

“వారి విడాకులు?”

“అమెరికాలోవలె అతిసులభమనుకున్నావా రష్యాలో? విడాకులు పుచ్చుకుని ఇంకో భార్యనో, భార్యభర్తనో చేసుకోవడంకన్న ఉన్నవారితో జీవించడమే మహోత్తమం అన్నంత చేశారు. కాబట్టే విడాకులు ఉండటమే లేదు రష్యాలో! అంతగా విడాకులు కావాలన్నవారికి ఎన్ని అడ్డంకులు వచ్చినా భయంలేదు.”

చౌధురాణీ ఆలోచనాధీనయై అయిదు నిమిషాలు అలాగే కూచుంది. "అయితే మనదేశంలో కమ్యూనిస్టులంటే అంత చెడుపేరు వచ్చిందేమిటి?” అని ఆమె ప్రశ్నించింది.

6

రెడ్డీ చౌధురాణీ కలిసి సినీమాలకు, వాహ్యాళులకు వెళ్ళుతున్నారు. అలా ఇద్దరే వెళ్ళడం సాగించిన మొదటి దినాలలో ఏవేవో విషయాలు మాట్లాడడమేగాని ఒక ప్రేమ సంభాషణ వచ్చేదిగాదు. “డాక్టరుగారూ!” అని చౌధురాణి పిలిస్తే “చౌధురాణిగారూ!” అని డాక్టరు రెడ్డి పిలిచేవాడు. రష్యా సంగతులు, యుద్ధం, వ్యాపారాలు, భారతదేశంలో కాంగ్రెసు, ముస్లింలీగు, కమ్యూనిస్టులపక్షాల విషయం, వాని భవిష్యత్తులు, ఇవన్నీ కలసి పనిచేసే సావకాశాలు మొదలయినవి మాట్లాడేవారు.

కాంగ్రెసు ఉపనాయకులు, అరుణ అసఫాలీ, పట్వర్దన్ మొదలయిన వారి దాగుడుమూతలు, బోసు, అజాద్, హిందూసేన మొదలయిన విషయాలన్నీ చర్చకు వచ్చేవి.

ఒకరోజు సాయంకాలం వారిద్దరూ మోటారులమీద చెంగల్పట్టు, కంచి వెళ్ళడం సంకల్పించుకొన్నారు. బయలుదేరినారు. కంచిలో శిల్పం చూడాలని చౌధురాణి సంకల్పింది. ఏవేవో మాటామంతి ఔతున్నాది. చౌధురాణి శిల్పకళను గూర్చి, చిత్రకళను గూర్చి బాగా చదువుకుంది. బందరు జాతీయ కళాశాల వాతావరణంలోకి పోయి చిత్రలేఖనం నేర్చుకుంది. కళను గూర్చి తన అభిప్రాయాలు రెడ్డితో చెప్పడం సాగించింది.

ఇద్దరూ ఒకరిదగ్గరకు ఒకరు చేరుదామనుకుంటున్నారు. కాని జరగలేదు. ప్రేమవాక్యాలతో చౌధురాణీని ముంచెత్తుదామని రెడ్డి ఉవ్వీళ్ళూరుతాడు. ఏమి మాట్లాడాలో తెలియదు. కోనంగే అయితే ఈపాటికి మూడు ప్రణయకావ్యాలు వ్రాసి ఉండును. ఇంటి దగ్గర రోజూ ఎలా ప్రారంభించాలో అవన్నీ ఊహించుకుంటాడు రెడ్డి. అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి అబ్బాయి పని నత్తిరావడంవరకు వస్తుంది.

చౌధురాణీ డాక్టరు ఎప్పుడు ప్రణయ సంభాషణ ప్రారంభిస్తాడా అని ఎదురు చూస్తూంది. ఒక్కసారయినా తన్ను గాఢంగా హృదయానికి అదుముకుంటాడా? నిజంగా ఆయన తన్ను ప్రేమిస్తున్నాడా, లేక ప్రేమిస్తున్నానని అనుకున్నాడా అని ప్రశ్నించుకొంది.

ఆ వనితను ప్రేమిస్తూ, ఆమెతో ప్రేమ సంభాషణ ప్రారంభించవలసింది పురుషుడుగాని, పురుషునితో స్త్రీ ఎల్లా సంభాషణ ప్రారంభిస్తుంది. ఇవి అనుకుంటూ ఏమీ మాట్లాడకపోతే ఎట్లా అని ఇద్దరూ ఏవేవో పిచ్చి సంభాషణలు ప్రారంభిస్తారు. ఆ సంభాషణలోంచి తప్పుకోలేరు.

కోనంగి (నవల)

273