పుట:Kokkookamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

శైవాగమము వైద్యసంహితయును మన్మ
                 థాగమములును శబ్దార్ణవంబు
నొడ్డామరంబును నొడ్డికమును హార
                 మేళనంబును నాదిమీననాథ
కచ్ఛపుటాది నాగార్జునమతములఁ
                 బరికించి బహువిధభంగులైన
మంత్రౌషధక్రియామతములు తత్ప్రయో
                 గంబుల నెఱిఁగి యాక్రమము దెలిసి


గీ.

సకలజనసమ్మతంబుగా సంఘటించి
పురుషులకుఁ గాంతలకుఁ బరస్పరగుణాను
రాగభూషణమైన యీరతిరహస్య
తంత్ర మెఱిఁగింతు సంక్షేపతరనిరూఢి.


తా.

శైవాగమము, వైద్యసంహిత, మన్మథాగమము, శబ్దార్ణవము, ఒడ్డా
మరము, ఒడ్డికము, హారమేళము, నాగార్జునము, మొదలగు పుస్తకములనుండి
యనేకవిధములగు మంత్రౌషధక్రియలను వానియుపయోగముల నెఱింగి సర్వజను
లును దెలుసుకొని పురుషులు స్త్రీలు యొకరిపై యొకరు ప్రేమగలిగియుండుటకు
సంక్షేపముగా యీరతిరహస్యతంత్రము నెఱింగించుచున్నాడను.


శ్లో.

వేగాదీని తదంగాన్యప్యంగీకుర్వతే ద్విధా వృద్ధాః।
తస్య తదంగానామితి మంత్రౌషధవిధయ ఉచ్యన్తే॥


క.

మంత్రౌషధంబు లనఁగాఁ
దంత్రజ్ఞలు వీనిఁ దెలిసి తాత్పర్యమునన్
మంత్రింతురు గావున నీ
మంత్రపువిధిఁ జెప్పి పిదప మందు వచింతున్.


తా.

మంత్రౌషధములనిన తంత్రముల నెఱింగినవారు వీనిని తెలిసికొని
దృఢాభిప్రాయమున మంత్రింతురు. కనుక మంత్రములను తెలిపి పిదప మందు
లను గుఱించి చెప్పెదను.