పుట:Kokkookamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

శ్రీవత్సగోత్రప్రసిద్ధసంభూతి నా
                 పస్తంబసూత్రప్రశస్తఘనుఁడ
గురుదయానిధియైన కూచనమంత్రికి
                 నంగనామణి ముత్తమాంబికకును
దనయుండ సత్కవీంద్రసుమాన్యచరితుండ
                 శివకృపాసుజ్ఞానశేఖరుండ
నారూఢవిద్యాచలానందయోగీంద్ర
                 శిష్టప్రచారవిశిష్టఘనుఁడ


గీ.

నెఱ్ఱయామాత్యుఁడను సత్కవీంద్రహితుఁడఁ
గలితవాక్ప్రౌఢిఁ గొక్కోకకవివరుండఁ
జతురమతితోడ రతికళాశాస్త్ర మిదియు
దెనుఁగు గావింతు రసికులు వినుతిఁజేయ.


వ.

అని తలపోయుచున్న యవసరంబున—


సీ.

తనకీర్తికామిని దశదిశాభామినీ
                 స్మితకపోలములకు మెఱుఁగుఁబెట్ట
తనభవ్యమూర్తి కాంతామదాలస నవ
                 వీక్షణద్యుతులకు విందొనర్ప
తనవైభవంబు బాంధవకవిగాయక
                 మానసాంతరముల మఱుఁగుఁజేయ
తననీతిగరిమయు ఘనతరాంకుశము దు
                 ర్మంత్రికుంజరముల మదము లణప


గీ.

చండలాంబ మహాలక్ష్మి సత్కృపాప్ర
సాదసాధితవైభవసాంద్రయశుఁడు
మంత్రిమాత్రుఁడె భైరవమంత్రిసుతుఁడు
మంత్రనిధి కుంటముక్కల మల్లమంత్రి.