Jump to content

పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కవికోకిల గ్రంథావళి

[నక్షత్ర


శిలలఁ బ్రవహించి, శీకరంబులను జల్లి
ప్రకృతిహృద్గతభావంబు బయలుపఱచు
గానముం జేయు మలయూఁటకాల్వ గాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుండు?

శారదేందుమయూఖ సంస్పర్శనముల
దైనిక స్వప్నమాంద్యమ్ముఁ దలఁగఁ ద్రోసి
మొలకనవ్వులమేల్కను కలువ గాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుండు ?

యామినీ వ్యోమమండల ప్రాంగణమున
సుకవియానంద రాజ్యంబుఁ జొచ్చువేళ
శోభ వెదచల్లు మురిపెంపుఁ జక్కగాఁగ
నేల సృజియింపఁడో నన్ను నీశ్వరుడు ?