పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భగ్నహృదయము.

_____________

ప్రియావియోగము.

________

జలధరమాలికా మలినశయ్యను మిత్రుఁడు గూలె; నేడ్పులా
ర్పులఁ బులుఁగుల్ కులాయముల పొంతలకేఁగక కొమ్మలెక్కిము
క్కులఁ దడిలేకయూర్చు; వడఁగూరినపోలికఁ బూలతీగలుం
దలలనువాంచు; గాలి వెతతాకున మూల్గు సహానుభూతితోన్.

మును గనుపండువై తనరు మోహనవస్తువులెల్ల వెల్లఁబో
యినగతి బాష్పముల్ దొనఁక నేడ్చుచు నీరవభాషఁ బల్కెడిన్
‘గనుఁగొన, మాకునున్ నెగులుగల్గెడి నీదు ప్రియావియోగ సం
జనిత దురంతతాపమున, శాంతిలుమోయి' యటన్నమాటలన్.