పుట:Kavijeevithamulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కవి జీవితములు

ఇంతవఱకును మనమాంధ్రదేశములోని ప్రాచీనరాష్ట్రమును బాలించెడు మైలమభీమునివంశస్థులచరితము సూచించుబిరుదులం జెప్పితిమి. ఇపుడు భీమకవిసమకాలీనుఁడును రేచర్లగోత్రద్భవుఁడును నగు ఆదిజగన్నాథరా వనుప్రభునివంశస్థులలోఁజెల్లెడు బిరుదావళులఁ జెప్పెదము. అట్టిబిరుదులం జెప్పుటకుఁ బూర్వమీయాదిజగన్నాథరావుంగూర్చి కొంచెము చెప్పవలసి యున్నది. ఇతఁడు రేచర్లగోత్రనామమునకుఁ బ్రాతి పదిక యగుచెవ్విరెడ్డితండ్రి పోలన్నకు మూలపురుషుఁడు. ఇంతకంటె నీయాదిజగన్నాథరావు వృత్తాంతము పద్మనాయక చారిత్రము పుట్టిన నాఁటికే తెలిసి యుండలేదు. చెవ్విరెడ్డినాఁటికి వీరిగోత్ర మామనగంటి గోత్ర మని యుండెను. రేచఁ డనువానికిఁ జెవ్విరెడ్డి యిచ్చినవరమును బట్టి వానిపే రిడఁగా నాఁటనుండియు నీచెవిరెడ్డి రేచర్లగోత్రముచే నొప్పెను. ఈచెవ్విరెడ్డి కారణాంతరమునఁ బిల్లలమఱ్ఱిభేతాళరెడ్డి యను పౌరుషనామంబు నోరుగంటిప్రతాపరుద్రునివలన సంపాదించి ప్రసిద్ధి నొందెను. వెలమలగోత్రములు నిర్ణయింపఁబడినసమయమునకు ననఁగా శాలివాహన. సం. 1010 నకు రేచర్లవారిలో నప్పనామాత్యుఁ డను నొకప్రభుం డుండెను. ఇతఁడు భేతాళరెడ్డి కెట్టిసంబంధము గలవాఁడో దానిం దెల్పుటకుఁ దగినగ్రంథసహాయము కాన్పించలేదు. ఇతఁడే భేతాళరెడ్డి యగు నని యూహింపనై యున్నది. రేచర్లగోత్రుల కాతని నాఁడు కల్గినబిరుదములు ముందుగ నీక్రింద వివరించెదము.

1. పంచవాద్యేయదళవిఫాలబిరుదు. -

2. కాకతిరాయరాజ్యస్థాపనాచార్యబిరుదు. -

ఇతఁడు కాకతిపోలురా జని చెప్పఁబడును. ఇతఁడు ప్రతాపరుద్రుని మాతామహుఁ డగుగణపతిరాజునకు బితామహుఁడు. ఇతనికాలములో ననఁగా శాలివాహన సం. 990 లో నోరుగల్లుపట్టణము కట్టఁబడినది. అపుడు చెవ్విరెడ్డితండ్రి పోలన్న యోరుగల్లునకు వచ్చినట్లుగాఁ గాన్పించును. ఈబిరుదు సంపాదించినవాఁ డితఁడే కానోవును.