పుట:Kashi-Majili-Kathalu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

ఈ ప్రబంధమును సంస్కృతమున గద్యముగా రచించినవాఁడు బాణకవి. ఇతఁడు శ్రోత్రియ బ్రాహ్మణుఁడు. వాత్స్యాయన సగోత్రుఁడు, హర్ష వర్ధనుని యాస్థానకవి. మయూరకవికి మేనమామ. శోణానదీకూలముననున్న ప్రీతికూటమితని జన్మభూమి. తల్లి రాజదేవి. తండ్రి చిత్రభానుఁడు. తాత యర్ధపతి. ముత్తాత కుబేరుఁడు. ఇతండు జనించిన యాఱవదినమునఁ దల్లియుఁ బదునాలుగువ వత్సరమునఁ తండ్రియు మృతినొందిరి. ఈకవి హర్ష చరిత్రమను మఱియొక గద్య కావ్యమునఁ దనచరిత్రయంతయుఁ దెల్లముగాఁ జెప్పికొనియెను.

హర్ష వర్ధనుఁ డాఱవశతాబ్దములో రాజ్యము చేయుచున్నట్లు పెక్కు నిదర్శనము లుండుటచే బాణకవియు నాఱవశతాబ్దము చివరగాని, యేడవశతాబ్దము మొదటఁగాని యుండవలయును. కావున నిప్పటి కించుమించుగాఁ బదమూఁడువందల సంవత్సరముల క్రితము వాఁడని తోఁచుచున్నది. ఇతఁ డంత్యదశయందీ గ్రంథమును రచించెను. కాదంబరి, పత్రలేఖచేఁ జంద్రాపీడునకు సందేశము పంపునప్పుడు 1724 గద్యము 'జ్ఞాస్యసి మరణేన ప్రీతిమిత్యసంభావ్యం' అని వ్రాసి యందుఁగల యశ్లీల దోషంబున నతండు హటాత్తుగా మరణము నొందెనని చెప్పుదురు.

బాణకవి కుమారుండు తరువాతికథఁ బూర్తిజేసెను. దానికే యుత్తరభాగమనిపేరు. బాణకవి కథాసరిత్సాగరములోని శక్తి యశోలంబకమునందలి మూఁడవతరంగమున గోముఖుఁడనువాఁడు నరవాహనదత్తునకు వినోదమునకై చెప్పినకథనే కాదంబరిగా రచించెను.