పుట:Kanyashulkamu020647mbp.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరట- పీకవుత్తరిస్తారు.

మధు- అదేదో చూస్తాను.

కరట- బ్రహ్మహత్య కట్టుకుంటావా యేమిఁటి?

మధు- అహా! యేమి బ్రాహ్మలూ!- అయినా పోలిశెట్టి చెప్పినట్టు, యెంత చెడ్డా బ్రాహ్మలుగదా? యిందండి; (కంటెయిచ్చును) తిలోదకాలేనా?

కరట- యెంతమాట? పువ్వులలోపెట్టి మళ్లీరాదా? నీయెదట అనవలిసిన మాట కాదు. నీలాంటి మనిషి మరిలేదు. కించిత్‌ తిక్కలేకుంటేనా!

మధు- ఆతిక్కేగదా యిప్పుడు మీకు వుపచరిస్తూంది?

కరట- యేం వుపచరించడం? చంపేశావు! ఆ డిప్టీకలక్టర్ని ఒక్కమాటుచూసి యీ బీదప్రాణిని కాపాడితే-

మధు- చాలించండి. యిక విజయంచెయ్యండి. (వెళ్లిపొమ్మని చేతితో సౌజ్ఞచేయును. కరటకశాస్తుల్లు, శిష్యుడు నిష్క్రమించుచుండగా) శాస్తుల్లుగారూ!

(కరటకశాస్తుల్లు తిరిగీ ప్రవేశించును.)

మధు- మీపిల్లని మహేశానికి యిస్తారా?

కరట- యిస్తాను.

మధు- అయితె నాకో ఖరారు చేస్తారా?

కరట- చేస్తాను.

మధు- యిక అతణ్ణి నాటకాలాడించీ, ముండలిళ్లతిప్పీ చెడగొట్టకండి.

కరట- యిటుపైని చెడగొట్టను- నాకుమాత్రం అక్ఖర్లేదా? (పొడుంపీల్చి) నీది గురూపదేశం, మధురవాణీ!

మధు- బ్రాహ్మలలో ఉపదేశంలావూ, ఆచరణతక్కువా. ఖరారేనా?

కరట- ఖరారే.

మధు- బ్రాహ్మలుకాగానే, దేవుఁడికంట్లో బుగ్గిపొయ్యలేరు అనుకుంటాను.

కరట- చివాట్లకి దిగావేఁవిటి?

మధు- చిత్రగుప్తుడికి లంచం యివ్వగలరా? అతడిదగ్గిరకి మధురవాణిని పంపి, చేసిన పాపాలు అన్నీ తుడుపుపెట్టించడానికి వీలువుండదుకాబోలు?

కరట- మధురవాణీ! జరూరు పనివకటుంది. మరిచిపోయినాను- వెళ్లి, రేపు మళ్లీ వస్తాను.

మధురవాణి- (నవ్వుచేత కుర్చీమీద విరగబడి, తరవాత నవ్వు సమాళించుకొని) ఒక్కనిమిషం ఆగండి. శిష్యుడా! (శిష్యుడు ప్రవేశించును) యేదీ, నాడు నువ్వు రామచంద్రపురం అగ్రహారంలో, రామప్పంతులు యింటి బైటనూ, నేనూ మీనాక్షమ్మా తలుపు యివతలా అవతలా ఖణాయించి వుండగా, తెల్లవారఝావుఁన నిశ్శబ్దంలో ఆకాశవాణిలాపాడిన చిలక పాటపాడి నీమావఁగారికి