పుట:Kankanamu020631mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంకణము ముక్తయై తరించుట

శా. అయ్యయ్యో! యొడలెల్లజల్లుమనునేలా? యిప్డు నాకేమిరా
   నయ్యెన్? దిమ్మిరివోవునట్లయగు నాయంగంబు; లాత్మన్ భయం
   బయ్యెన్; రాఁగలముప్పు చొ ప్పెఱుఁగ రాదయ్యెన్; భయంబేల? నా
   కియ్యబ్ధిన్ బడుకంటెగొప్పదగుముప్పేమున్న దూహించినన్.

చ. కువలయజీవితాంతకుని క్రూరకరాయతపాశభీతి నా
   కవుననుకొంట కట్టిసమయమ్మునుగా దటువంటిచిహ్న లె
   య్యవియునుదోప; వూరకభయంపడనేమిటి? కింతకున్‌శుభం
   బవునొకొ నన్నుదైవము దయామయదృష్టులఁ జూచె నేమొకో.

చ. కళలు తొలంగి రాహువుముఖంబునఁజిక్కివిముక్తమైన య
   ప్డలఁతి యలంతిగా ధవళమై కనవచ్చు సుధాంశుబింబ మ
   ట్లలఁతియలంతిగా ధవళమై కనవచ్చెడు నాదుమేను ని
   మ్ముల ననుఁగూడ నీశ్వరుడు ముక్త నొవర్చునె యిమ్మ హోదధిన్?

మ. ధవళంబైన కొలందిఁ గంటికిసమస్తంబున్ గడున్ వింతగా
    ధవళంబై కనవచ్చు; జిత్త మిపు డేతత్సాగరంబన్న భీ
    తి వడంబోక, సమత్వముం జెడక, శాంతింబొంది యుప్పొంగు; నిం
    తవిశేషంబగునూతనత్వ మెటు లొందంజాలినానోకదా!