శ్రీవెంకటాచలంగారు వర్గీటరు వ్రాసిన "The dynastiies of the kali Age" అను గ్రంధములో తెలియక చేసిన పొరబాబ్లనేకములను సవరించి వర్గీటరు తానాధారపడిన ఆ పురాణములనుండియే సరియైన భాగముల నుద్ధరించి చక్కగావ్యాఖ్యానించి వర్గీటరుచేసిన ప్రమాదభూయిష్టములైన నిర్ణయములను సవరించి సత్యమును ప్రకటింపగలిగిరి. కలిశక విజ్ఞానమును సమస్తాంధ్రులును పఠించి తీరవలయునని నా అభిప్రాయము అట్లే మనము విసించు జంబూద్వీప విభాగ నిర్ణయంలో శ్రీవారు చేసిన నిర్ణయము సర్వధా శ్లాఘ్యముగా నున్నది. ఆంధ్రులెవరు? అను వ్యాసము ఇంతకు పూర్వము చరిత్రకారులందరును త్రొక్కిన త్రోవను ద్రొక్కక క్రొత్త దృక్పధమును వెల్లడించుచున్నది. ఆంధ్రుల నిజస్వరూప మిట్టిదని శ్రీవెంకటాచలంగా రీగ్రంధమున నిరూపించిరి. ధృవనివాస ఖండనమను గ్రంధము శ్రీ తిలక్ గారు రచించిన "The Arcitic Home" అను ఇంగ్లీషు గ్రంధములోని విషయమునకు సప్రమాణమైన విమర్శనమై యున్నది. శ్రీ తిలక్ గారి గ్రంధములోని పాండిత్య విలంబనమునకు వేదవిజ్ఞానపు లోతుతెలియని హూణపండితులు ముగ్డులై జేజేలు పెట్టుచుండ అది కాదని అనేక ప్రమాణములతో నిరూపింప సాహసించి నిలిచిన ధీరులింతవరమును శ్రీ వెంకటాచలం గారొక్కరే. "భారతీయశకము" లనెడి యీగ్రంధము చరిత్రనిర్మాణమున కత్యంతొపయుక్తమైనది. వివిధ శకకాలములలో యిదివరకుండిన పొరబాట్లను చూపుచూ సరియైన కాలనిర్ణయములు సప్రమాణముగా యిందు నిరూపింపబడింవి. లోకములో ప్రబలముగ వ్యాపించిన సత్యసిద్ధాంతముల నరికట్టి సత్యచరిత్ర నిరూపణమునకు కంకణము కట్టిన శ్రీ వెంకటాచలంగారి పాండిత్య గౌరవ మసాధారణమైనదని చెప్పుట కెట్తి సందేహములేదు. ఈ ధోరణిలో శ్రీవారు వ్రాసిన గ్రంధము లెన్నియో గలవు. అవన్నియు నచిరకాలములో బ్రకటితములై ఆంధ్రులలో చరిత్ర విజ్ఞానవ్యాప్తికి తోడ్పడగలవని విశ్వసించుచున్నాను.
ఇట్లు చిలుకూరి నారాయణరావులు మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ, M.A.P.H.D.L.T. అనంతపు;రము 14-10-1950