పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

375

మధుమతీ! నాకోడండ్రయొక్క సౌజన్యమే నా కీమంచికిఁ గారణమగుచున్నది. మీలోమీరు తగవులాడక నక్క చెల్లెండ్రవలె మెలంగుచుండ నేనెంతయు మురియుచుందును. నీవు మూడులోకములకు నధికారియగు మహేంద్రుని పుత్రికవు. నాకూడిగము సేయుచుండ నాభాగ్య మనన్య సామాన్యమని యొప్పుకొనకతప్పదు. నేను మీయందరి ముందర వెళ్ళినచో ధన్యురాలనగుదును. కాలమెట్టివారికిని సమముగా నడువదు. ముందరి క్షణమున మనమెట్లుందుమో తెలియదు. ఇప్పటికి మంచిగానే వెళ్ళినది. అని పలుకుచుండఁగనే తాళధ్వజనృపాలుం డయ్యతఃపురమునకుఁ దొందరగా నరుదెంచెను.

అమ్మహారాజుం జూచి కోడండ్రందఱు సిగ్గున దిగ్గున గదులలోనికింబోయిరి. అసమయమున వచ్చిన భర్తరాకకు శంకించుకొనుచు సౌభాగ్యసుందరి తదాగమన కారణంబడిగిన నాయొడయుం డిట్లనియె.

ప్రాణేశ్వరీ! యిప్పుడు మనకుఁ జెడుకాలము వచ్చినట్లు తోచు చున్నది. బునబిడ్డలు నాలుగుదిక్కులు జయించివచ్చిరని సంతసించితిమి. మనకు భూమియందుఁగల రాజులందఱు విరోధులైరి. అది యట్లుండె. మన వీరవర్మ పాతాళలోకమునకుఁబోయి యందుఁగల రాక్షసుల సంహరించి యాలోకము వశము జేసికొనియెంగదా. వజ్రకంఠుని పినతండ్రి పాతాళకేతుఁ డనువాఁడు దేవతలకుఁగూడ నజేయుఁడట. వాఁడు అయ్యతలమునందు రక్కసులకుఁ గలిగిన యపజయము విని రౌద్రావేశముతోఁ గొందఱరక్కసుల వెంటఁబెట్టుకొని యాయతలంబున కరుదెంచి యందున్న మన దూతలనెల్లం బరిమార్చి బిలద్వారమునఁ జిత్రకూటనగరమునకు వచ్చి యందు గాపున్న మనమూఁకల నెల్లఁ జీకాకుపఱచి మ్రింగుచున్నాడఁట. వాఁడు కుంభకర్ణునంత యున్నవాఁడఁట. వాని యాకారము చూచినంతనే మనుష్యుల ప్రాణములు పోవునఁట. అందున్న వాఱువపుఱౌతు ఒకఁ డెట్లో వాని