పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సావిత్రికథ.

277

దప్పక తీసికొని వచ్చునను నమ్మకముతోఁ జేతఁ బుష్పదామంబులం ధరించి వారిరాక జూచుచుండిరి. ఇదియే సమయమని రాజకుమారులు నలువురు గుడిలోనుండియొకరి వెనుకనొకరు మెల్లగా నీవలకువచ్చి ముఖమండపములో నొకదెసశ్రేణిగా నిలువబడి యమ్మవారికి నమస్కరించిరి.

అప్పుడు దేవకాంతలు వారింజూచి మోహవివశలై యొక్కింత సేపు సిగ్గుపెంపునఁ దెంపుసేయక క్రేగంటిచూపులవారింజూచి చూచి లజ్జ దిగ ద్రోసి సాహసముతో మేను గఱు పార

క॥ నీవే నా ప్రాణేశుఁడ, వీ వే నాదైవమనుచు నెదసత్యముగా
     భావించి వరించితి నీ, దేవి కృపావశత ననుమతింపు మహాత్మా!

అని దేవకాంతలు వారువారు గట్టిన పుట్టంబులు గురుతుపట్టి మనోహరుగా నేరికొని మెడలోఁ బుష్పదామంబులు వైచుటయు వారును సంతోషావేశముతో

కం॥ ఇది నాసతి యిది నాసతి
       యిది నాసతియనుచు వెసగ్రహించిరి వార
       మ్మదవతుల కరతలంబులఁ
       దుది మదనుఁడె సత్పురోహితుండై కూర్పన్॥ |

అట్లు రాజకుమారగృహీత పాణులై యప్పల్లవ పాణులు లజ్జావనత వదనలై వారచూపుల నా భూపాల పుత్రుల సౌందర్యాతిశయం బాపోవక చూచుచుఁ దత్తదను రూపక్రియాకరణ నిరతచిత్తులై యమ్మవారి కెదురుగా నిలువంబడి

క॥ నినుఁగొనియాడ వశంబే
     జననీ గాయత్రి! మాకుసమధిక కరుణా
     ఖనివై దయజేసితి మో
     హనరూపులఁ బతుల గుణసమన్విత మతులన్ ॥