పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(పంచమ గుచ్చము)

ఇంతేనా? నా సంగతి విన. నా
వంతైనా ప్రియురాలి మనసు కరగదు
పంతమో, చింతయో
కంతుడురటే నా ఎడద గాసిపెట్టి, దూసిపెట్టి
చింతాకులంత చిందర చేసినా
డింతేనా?

అతని కంఠం చాలా మధురంగా ఉంది. ఆ పాట ఏదో కొత్త రకం బెంగాలీ వరసలా వుంది. ఆ కొద్ది మాటలూ మూడు నిమిషాలు పాడాడు రాధాకృష్ణ.

ఆ యువకుడు ఆ పాట ఎంత లోగొంతుకతో పాడినా చుట్టుప్రక్కలవారికి కొంతమందికి వినిపించింది గాబోలు నెమ్మది నెమ్మదిగా పదిమంది ఆ ప్రాంతాలకు చేరినారు.

“ఆడే రాధాకృష్ణడా?”

“అదు! ఎన్న రొంబా నైసా యిరుకు అంద కంఠం!”

“రాధాకృష్ణ ఏమి బాగా పాడతాడయ్యా!"

“ఆ అమ్మాయి కొత్త సినిమా స్టారులా వుంది.”

“మాంచి చురుగ్గా, షోగ్గా ఉంది.”

ఈ మాటలు అస్పష్టంగా వున్నా, పద్మావతీ చెవిలో పడ్డాయి. ఆమె మోము కెంపువారింది. ఆమె గుండెలు కొట్టుకున్నాయి. ఆమెకు కోపమూ వచ్చింది. సంతోషమూ వచ్చింది. ఆమె నెమ్మదిగా లేచి, తలవంచుకొని, బీచి రోడ్డువైపుకు నడవడం ప్రారంభించింది. అది గమనించి నరసింహమూర్తి “వస్తున్నాను వుండు అమ్మాయి!” అని కేకవేసి రాధాకృష్ణవైపు తిరిగి, “మళ్ళీ కలుసుకుంటాను. నీ అడ్రస్సు మురుగప్ప వీధి, పదోనెంబరు ఇల్లుకాదూ, త్యాగరాయ నగరంలో! తప్పకుండా వస్తాను. ఎప్పుడు నీకు సావకాశం?” అని ప్రశ్నించాడు.

“నాకా మాష్టారూ! ఎల్లుండి షూటింగు లేమీ లేవు. రేపు సాయంకాలం అయిదు తర్వాత మా ఇంటికి రండి. ఉండండి! ఉండండి! మిమ్మల్ని ఆ అమ్మాయినీ నా కారుమీద దిగబెట్టనా?” అని రాధాకృష్ణ అడిగాడు.

“వద్దులే, ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు.”

ఎంత చక్కగా వుంది అతని కంఠం! ఎంత తెచ్చిపెట్టుకుంటే వస్తుంది సంస్కారము? ఈ ప్రశ్నలు పద్మావతి హృదయంలో దారిపొడుగునా వున్నాయి. బస్సులో ఆమె నరసింహమూర్తి మేష్టారుగారితో మాట్లాడలేదు. ఏలాగో ఆంధ్రమహిళ కడ దిగింది. ఆమెను దించి నడిచి ట్రాం కడకు వెళ్ళి రాయపేట చేరుకున్నాడు నరసింహమూర్తి

అడివి బాపిరాజు రచనలు - 7

120

జాజిమల్లి(సాంఘిక నవల)