పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

79



5. మందమైన నగవుయొక్క విశేషముచే దిక్కులందు నిర్మల సుధను జిమ్మునది, యింద్రుని నేత్రముల కానంద మిచ్చునది యైన చంద్రముఖి నన్ను రక్షించుగాక.


6. ప్రేమ తరంగములతో సమమగు శీతలదృష్టులచే నింద్రుని మనస్సును మోహింపజేయునది, వక్రమైన కొప్పు గలదియైన దేవి నన్ను రక్షించుగాక.


7. గాఢరసము, మనోహరపదములు, గూఢతరమైన అర్థములుగల వాక్కులచే దేవేంద్రునకు కామము గలిగించు హేమతనుదేవి నన్ను రక్షించుగాక.


8. కాలమే శరీరముగాగల ఇంద్రునకు పార్శ్వవర్తినియై, మృత్యు రూపిణియై యే దేవి ప్రేతలోకమును రక్షించుచున్నదో, ఆ స్త్రీ నన్ను రక్షించుగాక.

(కాళీరూపలక్షణము. స్థూలమును నశింపజేసి, సూక్ష్మమును గాపాడునది యని భావము)


9. కొందఱీ ప్రేతజగత్తును పాపభూయిష్ఠమగు నధోలోక మందురు. మఱియొక తత్త్వ వేత్త యిది చంద్రునికంటె వేఱుకాదను చున్నాడు.


10. ఈ భూలోకము నుర్వి, వసుధయనియు, భువర్లోకమును పద్మములకు శత్రువైన చంద్రుడనియు, తేజోరాశియైన సూర్యుని సువర్లోకమనియు, భూలోకములో నరులు, భువర్లోకములో ప్రేతలు, సువర్లోకములో సురలు వసింతురనియు చెప్పబడును.