పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

257



7. ఆకాశశరీరిణియై ఆమె విపులముగ వ్యాపించిన సకల జగత్తుల కంటె శ్రేష్ఠమైన (జగత్తులకుమించి వ్యాపించుటచే నాకాశము శ్రేష్ఠము, జ్యేష్ఠము కూడ అగును) ప్రభుపదమును బొంది యున్నది. ప్రతిమానవదేహమందు ప్రవహించుచు విహరించు చున్నను పుట్టుక లేక యున్న ఆ యాకాశరూపిణి నా హృదయ మందు క్రీడించుగాక.

(అనిత్యమైన వికృతచలనరూపములకంటె నిత్యచలనాత్మకమైన ఆకాశము శ్రేష్ఠము. ఇదియే సర్వప్రవాహములకు మాతృక వంటిది.)


8. సమర్థమైన కులకుండాగ్ని జ్వాలలుగలది, లెస్సగా నుదయించిన భానునివంటి హృదయప్రభావమే లీలగాగలది, శిరస్సునందు ద్రవించు చంద్రకళామృతధారలు గలదియైన ఉదారమగుదేవి తన భక్తజనమును రక్షించుగాక.

(ప్రతిమానవునియందు నాకాశరూపిణియై వ్యాపించియున్న దేవి తదాకాశముద్వారా చైతన్యమునిచ్చి యనుగ్రహించునప్పుడు మాతృలక్షణము త్రివిధములై మూలాధార, హృదయ మస్తక స్థలములం దెట్లుండునో వచింపబడెను.)


9. ఇక్కడ ముందున (సృష్టియందు, లేదా శరీరక్రియలందు) విషయాకృతిగాను అక్కడ వెనుకను (ఆకాశమున నుండు నిర్గుణ పరాస్థితియందు) మిగుల నిర్మలముగాను నుండి (ఇది దివ్య స్త్రీరూపచైతన్యము), విశ్వమును గృహముగా బొందినను భువనములకంటె వేఱుగా నిర్దోషమై యతి శక్తివంతమైయుండు (బుద్ధిసంబంధమగు) రూపము నన్ను రక్షించుగాక.