పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

233



2. ముల్లోకములను కనిన యింద్రప్రేయసి యత్యంత గతిహీనురాలైనట్టి, నష్టబుద్ధియైనట్టి యీ భారతదేశముయొక్క దుస్థితిని తన కృపతోగూడిన కటాక్షకళచే నివారించుగాక. (కన్నబిడ్డ ననుగ్రహించు తల్లివలె)


3. ఆదియందు (అనగా విశ్వసృష్టికి పూర్వము) సచ్చిదానంద తత్త్వస్వరూపుడైన యీశ్వరుని చిత్తువైయున్న నీవు విశ్వసృష్టి కొఱకు పృథఙ్మతివైతివి.

(ఇక్కడ 4 రూపములు చెప్పబడెను. (1) కర్తయైన యీశ్వరుని యందభిన్నయై, తత్త్వస్వరూపముతోనున్న చిత్తు తానే కర్తయై ప్రభుత్వరూపిణియై మూలమందున్నది. (2) తరువాత సృష్టికొఱ కీశ్వరస్వరూపము తన మహిమచే వ్యాపించగా, మహీమా లక్షణమం దీశ్వరునే కర్తవలె ప్రచురించుట కహమ్మహమ్మను స్ఫూర్తులనిచ్చునొకానొక భాసమానలక్షణ యయ్యెను. ఇదియే సగుణ బ్రహ్మలక్షణము. 'అయితిని'అను నర్థమిచ్చు హృత్ + అయం = హృదయమను నామముచే ప్రసిద్ధమైన రూపమిదియే. (3) తరువాత (మహిమయొక్క వ్యాపారముచే చిమ్మబడుచున్న యీశ్వరసంపదనుధరించుటకు) ఆకాశశరీరిణి వైతివి. (4) అటు తరువాత (యీశ్వరునినుండి విభాజ్యమై చిమ్మబడు వీర్య వస్తు సంపద మహిమయుతమైయున్నను, ఈశ్వరచైతన్యము నీయనిదై జడత్వస్థితినిబొంది యాకాశగర్భమందుండగా, 'అహరి'చైతన్యమును బ్రవేశపెట్టిన అనుగ్రహ వ్యాపారమనెడి మాతృలక్షణముచే) సురపతికి నేత్రామృతమగు పద్మనేత్రయైన స్త్రీరూపిణి వైతివి. (ఇదియే యనుగ్రహ దేవతా స్వరూపము)