పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

151



12. ఓ దేవీ ! ముసలితనము, నాశనములేక సనాతనమై, ముని జనులచే తెలియబడు వైభవముగల తపోలోకము నీ కంటె వేఱుగా నుండదు.


13. ఓ తల్లీ ! సకలదృశ్య (ప్రపంచ) మునకు మూలకారణమగునది, నీ కాధారమగునది, యితరము నాశ్రయించనిది యగు పరమ పురుషవస్తువే సత్యలోక సంజ్ఞచే తెలియబడుచుండెను.


14. ఓ దేవీ ! పురాతన ఋషులభాషయం దీ గగనముదకమని (కం = ఆకాశము, ఉదకము) చెప్పబడుచున్నది. పిమ్మట భగవంతుని వీర్య మా యుదకములో ప్రవేశపెట్టబడెననియు, ఆవీర్యము భరించినది నీ వేయనియు పల్కుదురు.


15. ఓ శచీ ! ఈ నీ పేరును (వీర్యయుక్తజనోలోకము లేదా జన యితృత్వాకాశమును) 'విరాట్‌' యనియు శ్రుతి చెప్పుచున్నది. విస్తారమైన విశ్వము స్వరూపముగాగల శరీరమునకు (గర్భ మందు విశ్వముగల నీ శరీరమునకు) 'విరాట్‌' పదము ప్రసిద్ధము.


16. ఉపనిషద్భాషలో చెప్పబడిన 'విరాట్‌' వధూస్వరూపము నితర భాషలలో (శ్రుతిభాష గాక పౌరాణిక కావ్యాది భాషలలో) పురుషుడని చెప్పబడెను (విరాట్పురుషుడని). స్త్రీ పుంలింగములలో రెండు విధముల 'విరాట్‌' పదము సాధువగుటచే సంశయాస్పదముగా నున్నది.


17. (ఎట్లనగా) లోకములో శరీరమున కాంతర్యముననున్న వీర్య వస్తువు స్త్రీయుగాదు, పురుషుడుకాదు. స్థూలశరీరమునకు గల లింగభేద దర్శనమువలన శరీరమతముననుసరించి అంత రాత్మకు లింగము చెప్పబడెను. (విరాట్టునకు)