పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

149



9. ఓ దేవీ ! అట్టి యచింత్యమైన నీ శరీరము జనోలోకమనబడు చున్నది. అఖిలవ్యాప్తమైన యీ విశ్వభూత మేవిధముగా (మన) దృష్టికి జనించుచున్నట్లున్నదో,

(ఆవిదముగా జనోలోకమనబడుచున్న దని భావము. జననములను గలిగించు జనయితృత్వ ధర్మముచే లోకవాదినులా యాకాశశరీరమును జనో లోకమనిరి. ఇక్కడ ఆకాశనామావళి, లోక నామావళి - యీ రెండింటికి గల సంబంధము చెప్పబడెను. ఆకాశములు నాల్గని పూర్వము చెప్పబడెను. (1) ధూళిరూపమైనది. (2) ధూళిరహితమైనది (3) దానికంటె వేరైనది (4) పరాకాశము. నిజమున కాకాశమంతయు నొక్కటియైన సూక్ష్మరజోభూతమైనను, వ్యాపకత్య పరిణామమునందా రజస్సు సాంద్రతవ్యత్యాసములను బొంది తేజో౽బన్నము లనబడు త్రివిధములైన అణువులు గలది యయ్యెను. ఈ త్రివిధాకాశములను లోకవాదినులు భూర్భువస్సువర్లోకములనిరి. దీనిని వ్యాప్తమొనర్చిన మహిమను మహర్లోకమనిరి. ఆ మహిమను బొందిన సచ్చిదానంద స్వరూపమఖండమైనను దాని సత్తత్వమును సత్యలోకమనియు, చిత్తత్త్వము తపస్తత్త్వము గనుక తపోలోకమనియు, విశ్వముల నెన్నింటినైన పుట్టించుటకు వస్తుసమృద్ధిచే నానందమనబడు తత్త్వమును జనోలోకమనియు పిలచిరి. ఈవిధముగా లోకనామావళి యున్నను సచ్చిదానంద స్వరూపమంతయు నలోక మనియు, ఆకాశము మాత్రము లోకసంబంధమనియు, మహర్లోకమనబడిన మహిమ లోకాలోకమనియు నెఱుగవలెను. ఈ మహిమ జనోలోకమునుండి వికసించినందున దీనిచే వికసించిన జనయితృత్వ ధర్మము మహద్యుక్త జనోలోకమై మహాఞ్జనోలోకమని యీ కవిచేతనే ఉమాసహస్రమను గ్రంథమందు పేర్కొనబడెను. కేవలమహిమనుగాక అట్టి మహాఞ్జనోలోకమును జనోలోకమునుండి వేఱుచేసి మహర్లోకమనినట్లు తరువాత శ్లోకమునుండి తెలియగలదు. కాని యాకాశ నామావళియందు మహిమను వేఱుచేయక పరాకాశముగా వికసించిన జనోలోకమును గైకొని నట్లవగతమగును. సృష్టికొఱకు వికసించిన జనయితృత్వ ధర్మమువల్లనే చిత్సత్తులు జననీ జనకులయిరి.)


10. ఓ శచీ ! బహు తారాగణములతో గూడిన యొకానొక ఆకాశమును నీ యా కాశశరీరమునుండి విభజించి సుకవులు కొందఱు మహర్లోకమని వచించిరి.


11. ఓ దేవీ ! సూర్య, చంద్ర, భూలక్షణములతో గూడిన (అనగా తైజిస, అప్, అన్న మాణు భూతతత్వములుగల) సూర్యులు, చంద్రులు, గ్రహములుగల బహుళ జగత్తులతో నిండిన యీ మహర్లోకమంతయు నొక్కటికాదు.

(సువర్లోక, భువర్లోక, భూలోకసహితమని భావము.)