పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

121



11. శోకమును బోగొట్టునది, తమస్సును దొలగించునది, చిత్తమును సంస్కరించునది, పరిశుద్ధ వ్యోమశరీరము బొందినది యగు ఇంద్రాణియొక్క వీచిక యొక్కటి నన్ను బ్రవేశించుగాక.


12. కిరణములు వెడలుచున్న యీ మూలాధారము, కపాలభిన్న మైన యీ శిరస్సు, మోహవర్జితమైన యీ చిత్తముగల నన్ను వాసవశక్తి యా వేశించుగాక.


13. ప్రపంచమునుండి విరక్తమైన యీ కన్ను, భోగమునుండి విరక్తమైన యీ దేహము, ధ్యేయవస్తువునుండి విరక్తమైన యీ బుద్ధిగల నన్నింద్రాణి ప్రవేశించుగాక.


14. కంటి కదృశ్యమైన జ్వాలలను భరించుచు, మిక్కిలి ప్రకాశించుచు విస్తరించిన ఆకాశముచే విస్తృతమైన శరీరమును ధరించిన యింద్రాణి నన్ను ప్రవేశించుగాక.


15. పూర్ణ బుద్ధిని వ్యాపింపజేయుచు నెల్లప్పుడు శరీరమును వజ్రదృఢముగా నొనర్చు ఇంద్రాణి నన్ను ప్రవేశించుగాక.


16. ఆకాశమునుండి శిరస్సుపైబడుచు, సర్వశరీరమునందును సంతత దివ్యప్రవాహముగానున్న యింద్రాణి నన్ను ప్రవేశించుగాక.


17. సూర్యునియందుగల ప్రకాశకత్వము, అమృతమందుగల మోదకత్వము, సురయందుగల మాదకత్వము - యీ మూడు వాసవ శక్తియందున్నవి. ఆమె నాలోఁ బ్రవేశించుగాక.


18. ఇంద్రాణిశక్తి నాయొక్క మానసిక సత్యమును లెస్సగా బ్రకాశింపజేయుగాక, నా కుదారసంతోషము నిచ్చుగాక, సాత్త్విక బల మిచ్చుగాక.