పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

119



4. ఉజ్జ్వలవాక్కులు గలది కనుక నామె విక్రమమిచ్చును, ప్రేమ పూరితవాక్కులు గలదియై యోదార్చును, మంజులవాక్కులచే సంతోషమిచ్చును. ఇట్టి పన్నగవేణియగు ఇంద్రాణి ప్రకాశించు గాక.


5. శరచ్చంద్రునిబోలు ముఖము, మేఘపంక్తివంటి కొప్పుగల్గి నల్లని కలువ రేకులతో సమమగు చక్షువులందు వసించు దయ గల ఇంద్రాణి ప్రకాశించుగాక.


6. సంపెంగవంటి నాసిక, చెక్కిళ్లకాంతి మండలముతో క్రీడించు కుండల కాంతులు, వీణనాదమువంటి పల్కులు, దొండపండు శోభను హరించు నధరోష్ఠముగల యింద్రాణి ప్రకాశించుగాక.


7. నిర్మలములైన నగవులచే దిక్కులనెడి గోడల సమూహమును కడుగుచున్నది, మోహమును హరించునది, స్వర్ణ మాలచే బ్రకాశించు కంఠముగలది, సంతత లీలలతో గూడిన బుద్ధి కళలుగలది,


8. ప్రపంచమును బోషించు క్షీరభారమును ధరించు సువర్ణఘటములవలె ప్రకాశించు కుచములుగల మాతయైన నొకానొక దేవేంద్ర రాజ్యలక్ష్మి నా చిత్తమందు బ్రకాశించుగాక.


9. భక్తులకు దివ్యామృతము వంటిది, పాపాత్ముల కగ్ని వంటిది, ఆకాశమందు సంచరించు నింద్రసఖి యను నమోఘశక్తి నన్ను రక్షించుగాక.


10. అందరిని సంతోషపరచునది, పాపసమూహమును నాశన మొనర్చునది, అందరి బుద్ధులను బ్రకటించునది, ప్రాణబలమును సమకూర్చునది.