పుట:Himabindu by Adivi Bapiraju.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహితీ హిమాలయోత్తుంగ శృంగం

హిమాచల శిఖరాలవలె, గంగా యమునా నదులవలె శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్య స్రష్టల్లో అడివి బాపిరాజు గారు అగ్రశ్రేణిలోని వారు.

బాపిరాజుగారిది విశిష్టమైన వ్యక్తిత్వం. త్రివేణి సంగమంవలె, సంగీత, సాహిత్య చిత్రలేఖనాలు బాపిరాజులో కలగలిసిపోయాయి.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు బాపిరాజుగారిని గురించి చెప్పిన పంక్తులు కొన్ని చదివితే చాలు బాపిరాజుగారి వ్యక్తిత్వం అర్థమవుతుంది.


“అతడు గీసిన గీత బొమ్మై
అతడు పలికిన పలుకు పాటై
అతని హృదయములోని మెత్తన
అర్థవత్కృతియై


అతడు చూపిన చూపు మెఱుపై
అతడు తలచిన తలపు వెలుగై
అతని జీవికలోని తియ్యన
అమృత రసధునియై”


ఈ పంక్తులు బాపిరాజుగారి హృదయ స్వరూపాన్ని మన కన్నుల ముందు నిలబెడతాయి.

“హృదయములోని మెత్తన” “జీవికలోని తియన”

ఈ రెండు మహాగుణాలు బాపిరాజుగారిని మహా మానవునిగా తీర్చిదిద్దాయి.

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ నవలైనా తీసుకుని చదివితే ఆయనకు ఎన్నెన్ని విషయాలు తెలుసో అర్థమవుతుంది. తలస్పర్శిగా తెలిసిన వ్యక్తి ఆయన.

“హిమాలయోత్తుంగ శృంగం

నీ బ్రతుకు

ఉమాపతి నాట్యరంగం”

అని గాంధీజీని గురించి గానం చేస్తుంటే తన్మయులమై వినేవాళ్ళం. శరత్ పూర్ణిమా చంద్రికా ధవళమైన బాపిరాజుగారి హృదయం నభూతో నభవిష్యతి.

దాశరథి కృష్ణమాచార్యులు

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

విజ్ఞాన భవన్, 4-1-435,

బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్ - 500 001.