పుట:Himabindu by Adivi Bapiraju.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంతకు, ఈమె అమృతకన్య యగు టెట్లు? లోకములో నీ మెను తిరిగి విషరహితగా జేయువారే లేరా? స్థౌలతిష్యులు చేయగలుగునా? కలిగినను అట్లు చేయుట కనుమతించునా? ఏది మార్గము?

ఈ బాల తనకు అర్ధాంగి యగుటకే వీలులేనిచో తాను సర్వస్వము వదలి బౌద్ధదీక్ష గైకొని, ఏ సింహళమునకో, చీనాదేశమునకో, త్రివిష్టపమునకో వెడలిపోయి లోకమును, ధర్మమును ఆరాధించుట మేలు.

“ప్రభూ! నా పాట ఎట్లున్నది?”

“నీ పాట సరస్వతీదేవి వీణాగానమునకు పరీమళమును జల్లు చున్నది చంద్రబాలా!”

“ప్రభూ! ఏల మీరు నాకడకు పదియుసారులు వచ్చెదరు?”

“దేవీ! ఎంత బేలవు నీవు! నీవు నాసర్వస్వము; నేను నీవాడను. నిన్ను విడిచి యెట కేగుదును?”

“మహారాజా! నేను మృత్యుదేవతను. నన్నేల కోరుదురు? నాకు మీ నామస్మరణమే చాలు! మీ రూపమననమే చాలు. ఈ జన్మమున నా కింతకంటె భాగ్యములేదు. మిమ్ము దూరము నుండి పూజింపుచు, మీ నామము స్మరింపుచు, అగస్తిగగనులవలె యోగినినై యుండెదను.”

“అప్పుడు నేనును నీతోడ యోగినై తపస్సు చేసికొనెదను.”

“మీ రాజ్య మేమగును?”

“నీ వున్నచోటనే నా రాజ్యము.”

“మహారాజా! నాకు రాజవైద్యులెన్నియో విషయములు చెప్పుచున్నారు. ఎంత చిత్రము ఈ ప్రపంచము! ఎన్ని సుందరవిషయము లున్నవి! నాయెదుట యామినీ తమస్సులు విడిపోయి, ఏదియో మహత్తర ప్రపంచము న్నియో అందముల ప్రత్యక్షమగు చున్నది. దీనిపై మీరు విరక్తిచెంద నేల?”

“దేవీ! ఈ విచిత్ర ప్రపంచము నా కంటితో నీకు జూపి, నీ హృదయముతో నే ననుభవించినగదా రక్తి? కానినా డిదియెల్ల శుష్కమే నాకు.”

“మీ కంటితో ఏట్లు చూపిరగలరు?”

“మన మిద్దరము సముద్రయానముచేసి ఏవియో విచిత్రతీరాలకు పోదము. మనము హిమాలయపథములకు పోయి ఎన్నియో యుదయముల దర్శింతము. మన మిరువురమే! నీవు నాచేయి పట్టుకొని, నేను నీ హృదయమున; నీవు నా బాహువులలో, నేను నీ సర్వస్వమునందు.”

“ఓ దివ్యమూర్తీ! మీరు వెళ్ళిన ముహూర్తమునుండి మీరు వచ్చు దినమువరకు మీకై ఎదురు చూతును. మీరు వచ్చి వెళ్ళిపోదురు. మరల మీకై ఎదురుచూతును. ఈ జన్మమున నా కిదియే మహాభాగ్యము.”

“నిన్ను చూచి, ఆనందశిఖర మంటి వెళ్ళిపోదును. నీవే నాయెదుట. నీవే నా ఊహల, నీవే నా స్వప్నముల, నీవే నా హృదయమున, నిన్ను చూతును. మరల వెళ్ళిపోదును. నేను వెళ్ళుదును, నా ప్రాణము, నా ఆత్మ నీకడ ఆ పాదములలో, ఆ కుంతలములలో, ఆ పెదవులలో, నీ లోచన పద్మాంచలములలో, ఆ పెదవుల రక్తిమలలో! ఎట్లు నిన్ను విడిచి యుండుట?”

అడివి బాపిరాజు రచనలు - 2

• 230 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)