పుట:Himabindu by Adivi Bapiraju.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 అప్పటికే సూర్యుడు చండకిరణుండై మధ్యాహ్న సింహాసనము నాక్రమింప వేగమున బోవుచుండెను. అందరికిని నాల్కలు తడియారి పోవుచున్నవి. చిరుచెమ్మటలైన వారి దేహముల నుద్భవించుటలేదు. దాహముకాకుండ వైద్యుడు యష్టిమధుకాదుల భావనచేసిన మాత్రల నెల్లవారికి నిచ్చెను. అవి ఒక్కొక్కటియే వారు నోటిలో వైచుకొనుచుండిరి. వారి దాహము కొంచెము తగ్గజొచ్చినది.

ఇంతలో ఎదుట విగతజీవివలె పడియున్న యొక దివ్యసుందరి విగ్రహము! ఆ విగ్రహము దిగంబరమై ఒరనూడ్చి పడవేసిన కృపాణమువలె నున్నది.

ఆ విగ్రహపు దీర్ఘవినీలకుంతల భారము చెదరి, యామెపై ఆచ్ఛాదన వస్త్రమువలె పడియుండెను. ఆ విగ్రహము అమరత్వముదాల్చిన రూపమే. అయినను ఏ మహావిధి సంఘటనవల్లనో వాడిపోయిన నందనవన పారిజాతకుసుమమువలె నున్నది.

ఆ నాగుబాము విషాదముతో, ఆ పడియున్న విగ్రహముచుట్టు బుసలు కొట్టుచు వీరందరు నిలుచుండియున్నవైపు చూచుచు, తిరుగుచు తొక్కట పడుచుండెను.

ఈ దృశ్యమేమి? ఆ బాలిక ఎవరు? ఆమె ఎక్కడిది? ఆమె బ్రతికియున్నదా, చచ్చిపోయినదా? యని యాలోచన లందరిహృదయముల నొక్కసారి జనించెను. ఆ వైద్యగురువు పడియున్న బాలికను దూరమునుండియే ఒక నిమేషము తీక్షణదృక్కుల పరికించి “మహాప్రభూ! ఆ బాలిక బ్రతికియున్నది. కొనయూపిరితో నున్నయది. ఆమెకు వెంటనే చికిత్స సేయకపోయినచో ఆమె చనిపోవును. కాని.... కాని....” అని తొందర తొందరగా మాటలాడెను.

“కాని ఏమి! వెంటనే ఆమెను రక్షింపవలెను. రండు పోవుదము”

విష: ఆగుడు మహారాజా! ఒక్క అడుగు ముందుకు వేయకుడు! ఆమె ఏ మహత్తరవిషమో సోకి అట్లయియుండవచ్చును. ఆమెదగ్గరకు పోవుటే మృత్యువదనమున బడుట.

మహా: మఱి కర్తవ్యమేమి? వ్యవధి లేదు. ఆ దేవాంగన చనిపోవును. మీరు రానిచో నేను పోయెదను. ఏదిరా ఆ గొడ్డలి?

అని శ్రీకృష్ణసాతవాహనుడు ముందు కురకబోయినాడు. ఋషితుల్యడగు నా విషవైద్యుడు మహారాజుకడకు పరుగెత్తి వారిని నివారించి, “ప్రభూ! ఒక్క అడుగు ముందుకు వేసితిరా, తథాగతునిపై నాన! తొందర పడకుడు. నేను ఇంకొక మహావిషమును సేవింతును. ఈ విష మా విషమును విరచును. ఇది సేవించినవారు మూడుదినములావల వేయి గజనిమ్మ పండ్లు సంపూర్ణముగ భక్షింపవలయును! ఆ భయంకరవిషము ఈ విషమును నాశనముచేయుచు తాను నశించును. ఇప్పుడు నేను పోయి, ఆ విషమును నా సంచిలోనున్న గజనిమ్మపండును ఒలిచి ఆ రసముతో రంగరించి, ఆ బాలికనోటిలో పిండెదను. మీరంద రిచ్చటనే యుండుడు. ఆ వ్యాళగ్రాహియు, నేనును పోయెదము” అని వేగముగ బల్కెను.

వారందరట్లు చూచుచుండగనే, విషవైద్యునికడ విషము ఆ ఇరువురు భక్షించి, ముళ్ళకంచెలు గొడ్డలిచే ఛేదించుచుపోయి యా బాలికను చేరిరి. విషవైద్యుడు వెంటనే యామెపై తన ఉత్తరీయమువైచి యామె దిగంబరత్వమును కప్పెను.

అడివి బాపిరాజు రచనలు - 2

181

హిమబిందు (చారిత్రాత్మక నవల)